నిరుద్యోగంపై వైఎస్‌ షర్మిలకు తొలి విజయం

17 Jun, 2021 00:59 IST|Sakshi
నిరుద్యోగులతో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

బాధితుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనడం మా తొలి విజయం

ఉద్యోగాలు వచ్చేవరకు రాజీలేని పోరాటం

నేరేడుచర్ల / హుజూర్‌నగర్‌/ మిర్యాలగూడ: రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన నీలకంఠం సాయి కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ఆమె ఇక్కడికి వచ్చారు.

నిరుద్యోగులతో ముఖాముఖి మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆమె అన్నారు. తాము వస్తున్నామనే భయంతో ప్రభుత్వం నీలకంఠం సాయికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం సంతోషకరమైన విషయమని, తాము చేస్తున్న పోరాటంలో ఇది తొలి విజయమని చెప్పారు. కాగా, ఇటీవల మృతిచెందిన ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీబీసీఎల్‌) స్టేట్‌ కో ఆర్డినేటర్‌ గున్నం నాగిరెడ్డి కుటుంబసభ్యులను చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి షర్మిల పలకరించారు. అలాగే, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తన మద్దతుదారుడు సలీం కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట నాయకులు కొండా రాఘవారెడ్డి, పిట్ట రాంరెడ్డి, ఇందిరశోభన్, ఆదర్ల శ్రీనివాస్‌రెడ్డి, కర్రి సతీష్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.


చదవండి: ‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు

మరిన్ని వార్తలు