రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌కు ముప్పు 

9 Feb, 2023 01:35 IST|Sakshi

ఆయన ఏ పార్టీలో  ఉంటే ఆ పార్టీ నాశనం: ఎర్రబెల్లి  

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి ముప్పు ఏర్పడిందని, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాశనమవుతుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు ఐటెమ్‌ సాంగ్‌లా చూస్తారని, ఆయన వెంట పాదయాత్రలో కిరాయి మనుషులు తప్ప కాంగ్రెస్‌ నేతలు ఎవరూ లేరన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేశ్, నన్నపునేని నరేందర్‌తో కలిసి బుధవారం అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి బ్రోకర్, జోకర్, బ్లాక్‌మెయిలర్‌ అని వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు గ్రెనేడ్లతో పేల్చి వేయాలంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  

స్థాయిలేని వ్యక్తికి పీసీసీ పదవి.. 
స్థాయిలేని వ్యక్తికి పీసీసీ పదవి ఇచ్చారని రేవంత్‌ తన మాటలతో రుజువు చేసుకున్నారని, రేవంత్‌ నక్సలైట్ల భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రేవంత్‌ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పకపోతే ఆయన పాదయాత్ర మానుకోట దాటదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి పీడీ యాక్ట్‌ పెట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.  

మరిన్ని వార్తలు