ఏం జరగబోతోంది?.. ఈటల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

3 May, 2021 10:21 IST|Sakshi

రాజీనామా చేసే యోచనలో ఈటల రాజేందర్?

భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న ఈటల

కొత్త పార్టీపై అభిమానుల్లో జోరుగా చర్చలు

కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

సాక్షి, హైదరాబాద్‌: కేబినెట్ నుంచి బర్తరఫ్‌ అయిన నేపథ్యంలో ఈటల రాజేందర్‌ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈటల కొత్త పార్టీపై అభిమానుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ విచారణపై  ఈటల.. న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విషయంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈటల తన సతీమణి పేరు మీద నెలకొల్పిన జమున హాచరీస్ సంస్థ భూ ఆక్రమణలకు పాల్పడిందని ఇప్పటికే మెదక్‌ కలెక్టర్‌ ధ్రువీకరించారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నివేదిక కూడా అందజేశారు. మరోవైపు భూకబ్జా, అటవీ చట్టాల ఉల్లంఘన కేసులు నమోదుతో పాటు, అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1977 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే అటవీ సంరక్షణ చట్టం 1980 ప్రకారం చర్యలకు కలెక్టర్ సిఫార్స్ చేసిన సంగతి విదితమే. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. మరో వైపు ప్రభుత్వానికి నేడు విజిలెన్స్ నివేదిక అందజేయనుంది. అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈటల రాజేందర్‌ అరెస్ట్ పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శామీర్ పేట్‌లోని ఈటల రాజేందర్‌ నివాసానికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

చదవండి: ఫిర్యాదులు; రాష్ట్రవ్యాప్తంగా ఈటల ఆస్తులపై ఆరా!
రెండోసారి పవర్‌.. ఈటలపై నజర్‌!

మరిన్ని వార్తలు