Etela Rajender: డిజైన్డ్‌ బై, డిక్టేటెడ్‌ బై సీఎం.. అన్నీ ఆయనే..!

2 May, 2021 02:27 IST|Sakshi

మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదు 

పథకం ప్రకారమే నాపై కబ్జా ఆరోపణలు  

రెండోసారి గెలిచాక సీఎం బంధాలను పక్కనబెట్టారు 

నన్ను మంత్రిగా కాదు కదా.. మనిషిగానూ చూడలేదు 

నాకు శాఖ ఇవ్వడమే అవమానకరంగా ఇచ్చారు 

శపించేందుకు రుషిని కాదు.. కానీ ఎవరి పాపం వారికే 

పార్టీ మారే, పార్టీ పెట్టే ఆలోచనల్లేవు 

అనుచరులతో మాట్లాడాక భవిష్యత్‌ కార్యాచరణ 

‘సాక్షి’ టీవీతో ఈటల రాజేందర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో మంత్రులకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనే పరిస్థితులు లేవని, మొత్తం వ్యవహారాలన్నీ డిజైన్డ్‌ బై సీఎం, డిక్టేటెడ్‌ బై సీఎం అన్నట్లుగా సాగుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై శనివారం ‘సాక్షి’ టీవీతో మంత్రి ఈటల తన మనసులోని మాటలను పంచుకున్నారు. తనపై పథకం ప్రకారమే కబ్జా ఆరోపణలు చేస్తున్నారని, ఎవరేం చేయాలో ముందు కొందరు నిర్దేశించారని, దాని ప్రకారమే ఈ తతంగం నడుస్తోందన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో త్వరలోనే బయటకు వస్తుందన్నారు. సీఎం ఉద్యమ సమయంలో ఉన్నట్లుగా లేరని, ముఖ్యంగా రెండోసారి గెలిచాక బంధాలు, ఉద్యమకారులను పక్కనబెట్టారని ఈటల అభిప్రాయపడ్డారు. తప్పు చేస్తే పిలిచి మందలించాల్సిందిపోయి ఇలాంటి ఆరోపణలు చేయడం తన వ్యక్తిత్వాన్ని చంపడమేనని చెప్పుకొచ్చారు. శపించేందుకు రుషిని కాకున్నా ఎవరి పాపం వారికే తగులుతుందన్నారు. తానెలాంటి తప్పు చేయలేదని, సిట్టింగ్‌ జడ్జి లేదా అన్ని దర్యాప్తు సంస్థలతో విచారణకు తాను సిద్ధమేన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

సాక్షి: భూ ఆక్రమణదారుడు అన్న నింద విని ఏమనుకున్నారు? 
ఈటల: నా వ్యక్తిత్వాన్ని చంపేసే యత్నం చేయడం దారుణం. ఈ దరిద్రపు పద్ధతులు ఎవరూ చేయకూడదు.

ప్ర: అసైన్డ్‌ భూములు ఎందుకు కొనాల్సి వచ్చింది? 
జ: అసైన్డ్‌ భూములు అస్సలు కొనలేదు. మేం స్థాపించాలనుకున్న పరిశ్రమ కోసం టీఎస్‌ఐఐసీని ఆశ్రయించాం. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను గుర్తించాం. వాటిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే మాకు కేటాయిస్తామన్నారు. అదింకా ప్రాసెస్‌లోనే ఉంది. అంతే తప్ప కబ్జా పెట్టాననడం సమంజసం కాదు.  

ప్ర: ఈ భూముల గురించి సీఎంకు మీరు చెప్పారా? 
జ: సీఎం ఆఫీసులో నర్సింగ్‌రావును సైతం సంప్రదిస్తే మీరు అసైన్డ్‌ భూములను కొనలేరు, అమ్మలేరు.. యజమానులు సరెండర్‌ చేస్తే కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఆ లెక్కన ఎకరానికి రూ. 6 లక్షల చొప్పున కొనుగోలు చేశాం.  

ప్ర: సీఎంను చివరిసారిగా ఎప్పుడు కలిశారు? 
జ: గత అసెంబ్లీ సమావేశాల్లోనే కలిశా. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంలో మరోసారి కలిశాం. ఈ వ్యవహారం తరువాత ఆయన్ని కలిసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కేటీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా కరోనా కారణంగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

ప్ర: కేసీఆర్‌కు మీరు సన్నిహితులు.. ఈ వ్యవహారంలో ఆయన మీ వివరణ ఎందుకు కోరలేదు? 
జ: కనీసం నా అభిప్రాయం అడగకుండా మీడియాలో నాపై ఆరోపణలు రావడంతో వారి ఆలోచన ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుబాటులో ఉన్న అన్ని దర్యాప్తు సంస్థలు, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నా. 

ప్ర: పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు వెనుకబడుతున్నట్లు మీకు అనిపిస్తోందా? 
జ: ఉద్యమంలో అంతా కలసి పనిచేసినం. ప్రభుత్వం వచ్చాక అంతా గమ్మత్తు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం, సహచరులు అన్న భావనలను సీఎం కొట్టిపారేసిండు. రొటీన్‌ రాజకీయ పార్టీలా మార్చిండు. 

ప్ర: ఉద్యమ కాలంలో మీ ఇద్దరూ కలసి పనిచేశారు.. ఆకస్మిక మార్పునకు కారణాలేంటి? 
జ: తెల్వదు మరి. పనితీరు ఆధారంగా కేబినెట్‌లో మార్పులు సాధారణమే. తప్పులుంటే పిలిపించి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఆ సంస్కృతి లేదు. ఎవడిలో వాడే కుమిలిపోవాలి.. వెళ్లిపోవాలి తప్ప మరేమీ ఉండదు. 

ప్ర: కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈటల మంత్రిగా కొనసాగడం సమంజసమేనా? 
జ: నిష్పక్షపాతంగా విచారణ కోరుతున్నా. ఉద్దేశపూర్వకంగా నాపై ఆరోపణలు చేయడం ధర్మం కాదు. 

ప్ర: మధ్యాహ్నం ఫిర్యాదు, సాయంత్రానికి విచారణకు ఆదేశాలు రావడంపై ఏమంటారు? 
జ: ఇదంతా ముందస్తుగా అనుకున్న ప్రకారమే జరిగింది. ఎవరెవరు ఏం చేయాలో ముందే ని ర్ణయించారు. యాదృచ్చికంగా జరిగింది కాదు.

ప్ర: పార్టీలో అత్యంత సీనియర్, మంత్రి అయిన మీపై కుట్రలు ఎవరు చేస్తారు? 
జ: త్వరలో బయటకు వస్తది. 

ప్ర: ఈ పరిణామాలు మీకు ఆందోళన కలిగించడం లేదా? 
జ: నేను ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ కమిటీలో మెంబర్‌గా ఉన్న. పరిశ్రమలు పెట్టుకొనేందుకు భూము లు, పన్నులు, కరెంటులో రాయితీ కల్పించాం. రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టి రూ. 100 కోట్లు రాయితీ అడిగినోళ్లను చూసిన. మేం నిజాయతీగా చేసుకొనే పౌల్ట్రీ పరిశ్రమపై కక్ష సాధించడమేంది? ఇది మం చిది కాదు. నేను శపించడానికి రుషిని కాదు గానీ, తప్పకుండా ఎవరి పాపం వారికే తగులుతుంది. 

ప్ర: మీ కులంపై వస్తున్న ఆరోపణలపై ఏమంటారు? 
జ: మేం కులం, మతాలను నమ్ముకున్న వాళ్లం కాదు. మానవత్వాన్ని నమ్ముకున్నాం.

ప్ర: మిమ్మల్ని సాగనంపేందుకు రంగం సిద్ధమైందా? 
జ: ఎవరిని ఉంచాలో నిర్ణయించే సర్వాధికారి సీఎంయే. మూడు నెలలపాటు కేబినెట్‌ లేకున్నా ఎవరూ అడగలేదుగా. అంతా ఆయన చేతుల్లోనే ఉంది. 

ప్ర: టీఆర్‌ఎస్‌కు అసలైన ఓనర్లెవరు? 
జ: జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ, కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరూ ఓనర్లే. 

ప్ర: జెండా మోసిన వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు? 
జ: రెండోసారి గెలిచాక ఉద్యమాలు, ఉద్యమకారులు, ఈ బంధాలు అక్కర్లేదు అన్న భావనకు సీఎం వచ్చారు. 

ప్ర: మీ అభిప్రాయాలను ఆయనతో పంచుకొనే ప్రయత్నం చేయలేదా? 
జ: ఉద్యమ సమయంలో అలాంటి సమయం ఉండేది. మంత్రులయ్యాక అంత తీరిక లేదు. 

ప్ర: వైద్య, ఆరోగ్య శాఖలో మీకు, అధికారుకుల మధ్య సమన్వయం లేని మాట నిజమేనా? 
జ: వాస్తవానికి మేము అడ్జస్ట్‌ అయి బతకడం నేర్చుకున్నం. నిత్యం ఘర్షణ వాతావరణం వద్దునుకొని ప్రజల అవసరాలు తీర్చే ప్రయత్నం చేశాం. చేసినంతకాలం వైద్య, ఆరోగ్య శాఖలో నిజాయతీగా చేసినం. పని చేసిన తృప్తి ఉంది. 

ప్ర: అచ్చంపేట ప్రజలకు ఏం చెప్తారు? 
జ: మేం ఏనాడూ వారిని ఇబ్బంది పెట్టలేదు, వారి భూములను కబ్జా చేయలేదు. చెప్పుడు మాటలు నమ్మి ఇలాంటి ఆరోపణలు చేయవద్దని వినతి. 

ప్ర: అభిమానులకు ఏం చెబుతారు? 
జ: కరోనా విజృంభిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలు పాటించాలి. ఎవరినీ కించపరచొద్దు, బాధపెట్టొద్దు. ఎలాంటి ధర్నాలు చేయకండి. తప్పకుండా మనమంతా మాట్లాడుకొని చర్చించి నిర్ణయం తీసుకుందాం. 

ప్ర: సీఎం పిలిస్తే వెళతారా? 
జ: చూస్తా 

ప్ర: రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించాక మీకు, సీఎంకు దూరం పెరుగుతున్నట్లు అనిపించిందా?  
జ: రెండోసారి గెలిచాక సీఎం ఆలోచనల్లో మార్పు వచ్చింది. మూడు నెలలపాటు కేబినెట్‌ ఏర్పాటు చేయలేదు. దానికి కారణాలు ఆయనకే తెలియాలి. చివరకు నాకు శాఖ ఇవ్వడం కూడా అవమానకరంగా ఇచ్చారు. నాపై కొన్ని పత్రికల్లో కథనాలు రాయించారు. ఎక్కడా నన్ను మంత్రిగా, సహచరుడిగా కాదు కదా.. కనీసం మనిషిగా కూడా చూడలేదు. కేబినెట్‌ మినిస్టర్‌కు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయినా ఎవరూ పట్టించుకోలేదు. 

ప్ర: ఇన్నేళ్ల కాలంలో ఈటల సంతృప్తిగా ఉన్నారా?
జ: ఏ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఆత్మగౌరవం, పనిలో స్వేచ్ఛ కోరుకుంటారు. ఈ రోజు విధానమేమిటో... మాకు, ఆఫీససర్లకు ఉన్న సంబంధం ఏంటో మీకు బాగా తెలుసు. ఈ రోజు మంత్రులెవరూ స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. అన్నీ డిజైన్డ్‌ బై సీఎం. డిక్టేటెడ్‌ బై సీఎం. మా దగ్గర ఏముంటది? సీఎం సర్వం కావచ్చుగాక.. కానీ ఏ శాఖకు సంబంధించిన పథకాలను రూపొందించే క్రమంలో ఆ శాఖ మంత్రిని కూడా దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని మంత్రులు బయటకు చెప్పకపోవచ్చు.  

ప్ర: మరో పార్టీ పెడతారా? ఇంకో పార్టీలోకి వెళ్తారా? 
జ: నాకు అలాంటి ఆలోచనలు లేవు. వచ్చే ప్రభుత్వ నివేదిక కూడా నాపై బురదజల్లే యత్నమే. ఇంకా ఎన్ని చేస్తరో ఇట్లా. నిజంగానే ఇలాంటి తప్పులు జరిగితే పిలిచి మందలిచొచ్చు కదా.. అడగొచ్చు కదా.. ఒక్కనాడూ మాట్లాడకుండా టీవీలల్ల వేసి బద్‌నాం చేయడం ఎంత వరకు సమంజసం? మా ముఖ్యమంత్రికి తెలియకుండా చీమ చిటుక్కుమంటదా మా ప్రభుత్వంలో? మంత్రులు అక్రమాలు చేసే ఆస్కారం ఉంటదా? అంత ధైర్యం చేస్తారా?  

మరిన్ని వార్తలు