పోరాటాలు చేసిన వారే చరిత్రకెక్కుతారు

19 Aug, 2021 01:55 IST|Sakshi

40 ఏళ్లైనా దళితులందరికీ డబ్బులు రావు 

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ 

ఇల్లందకుంట (హుజురాబాద్‌): ఉద్యమాలు, పోరాటాలు చేసేవారే చరిత్రకెక్కుతారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేసిన బిడ్డను ప్రజలు గుర్తుంచుకుంటారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో దళితబంధు రావడానికి కారణమైన ఈటలకు దళిత సంఘాల సమైఖ్య వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానసభ ఏర్పాటుచేశారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు కావడం కష్టమని తెలిసినా ప్రజలను నమ్మించేందుకు, అధికారం కోసం దేనికైనా సిద్ధమవుతాడని విమర్శించారు.

నాలుగేళ్లు కాదు కదా.. 40 ఏళ్లైనా దళితులందరికీ ఇచ్చే డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవన్నారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతూ తన మద్దతుదారులను బెదిరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎస్‌సీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు సునీల్, మాల మహా నాడు రాష్ట్ర నాయకులు శీలం శ్రీనివాస్, మాది గ హక్కుల దండోర జాతీయ అధ్యక్షుడు సురేందర్, రేణుకుంట్ల సాగర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు