Etela Rajender: కేసీఆర్‌ను వదిలి బయటకు రండి

11 Nov, 2021 09:47 IST|Sakshi

ఉద్యమకారులకు ఈటల పిలుపు

హుజూరాబాద్‌ ఆరంభమే.. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా ఇదే తీర్పు

ఈటల చేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించిన స్పీకర్‌ పోచారం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులు సీఎం కేసీఆర్‌ను వదిలి బయటకు రావాలని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ స్వభావం, నైజం బయటపడిందని, ఆయన టక్కుటమార విద్యలను అర్థం చేసుకుని నిజమైన ఉద్యమకారులు, మేధావి వర్గం ఇప్పటికైనా ఆలోచించి పార్టీని బహిష్కరించాలని కోరారు. సందర్భం వచ్చినపుడు హుజూరాబాద్‌ ప్రజల మాదిరిగానే కేసీఆర్‌ అహంకారం, అణిచివేత పద్ధతులపై యావత్‌ తెలంగాణ ప్రజానీకం చెంప చెల్లుమనిపించడం ఖాయమన్నారు. బీజేపీ నాయకత్వంలో కేసీఆర్‌ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేస్తానని, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎగిరేది కాషాయ జెండా మాత్రమేనని ధీమా వ్యక్తంచేశారు.

హుజూరాబాద్‌లో తన గెలుపు ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఇదే తీర్పు మొత్తం తెలంగాణలో పునరావృతం కాబోతోందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల రాజేందర్‌ బుధవారం శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు ఏపీ జితేందర్‌రెడ్డి, జి.వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకరరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద ఈటల, పార్టీ నేతలు నివాళులర్పించారు. 

చదవండి: (హుజూరాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌..)

ప్రజల తీర్పుతో కేసీఆర్‌ దిమ్మతిరిగింది...  
తాను అసెంబ్లీలో అణగారిన వర్గాల గొంతుకగా కొనసాగుతానని ఈటల అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీ ఎదుటనున్న గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే కేసీఆర్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ యువత కోసం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని పేర్కొన్నారు. ‘హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు రూ.600 కోట్ల అక్రమ సంపాదన ఖర్చు చేయడంతో పాటు, రూ.2,500 కోట్లతో దళితబంధు ప్రవేశపెట్టారని, వందల మంది మఫ్టీ పోలీసులతో ప్రజలకు కౌన్సెలింగ్‌ చేసి అసెంబ్లీలో నా ముఖం కనబడకుండా చూడాలని కేసీఆర్‌ శపథం చేసినా ప్రజలిచ్చిన తీర్పుతో కేసీఆర్‌కు దిమ్మతిరిగి పోయింది’అని అన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక గంటలకొద్దీ ప్రెస్‌మీట్స్‌ పెట్టి కేసీఆర్‌ మాట్లాడుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు.   

చదవండి: (ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్‌)

మరిన్ని వార్తలు