అబద్ధపు లేఖతో చిల్లర పనులు

30 Sep, 2021 01:23 IST|Sakshi
బీజేపీలో చేరినవారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఈటల రాజేందర్‌

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  

హుజూరాబాద్‌: ‘దళితబంధు వద్దు.. అని నేను రాసినట్టు ఓ అబద్ధపు లేఖ పుట్టించి చిల్లర పనులు చేస్తున్నారు. దానిపై మళ్లీ ధర్నాలు చేయిస్తున్నారు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ నేతలపై ధ్వజమెత్తారు. బుధవారం వావిలాల, ఇల్లందకుంట, ధర్మారం, మాదన్నపేట గ్రామాలకు చెందిన పలువురు స్థానిక నాయకులు జమ్మికుంటలో ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘హుజూరాబాద్‌లో ప్రశాంతత కోల్పోయి నాలుగు నెలలు అయింది. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నారు.

నాతో ఉన్న నాయకులందరినీ కొన్నారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా, దావత్‌లు ఇచ్చినా, దళితబంధు ఇచ్చినా.. ఈటల రాజేందర్‌ వల్లనే వచ్చాయని ప్రజలే కుండబద్ధలు కొడుతున్నారు’అని పేర్కొన్నారు. తమ బిడ్డకే ఓటు వేస్తామని చెప్తున్నారని.. దీంతో ఏం చేయాలో అర్థం కాక టీఆర్‌ఎస్‌ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘డబ్బులు ఇచ్చి ప్రెస్‌ మీట్‌ పెట్టిస్తున్నారు. నిన్న కొత్త అవతారం ఎత్తారు. ఒక ఊరికి పోతే అక్కడ కుటుంబంతో తిట్టిపించారు. ఆ కుటుంబం వారు వచ్చి అడిగితే ఒకరికి సబ్‌ స్టేషన్లో నౌకరీ పెట్టించిన. కొడుకుకు ఉద్యోగం పెట్టించండి అంటే హుజూరాబాద్‌ హాస్పిటల్‌లో ఉద్యోగం పెట్టించిన.

ఆయన అక్కడ ఉన్న డాక్టర్‌తో కలసి ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌ పెట్టి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేషెంట్లను అక్కడికి పంపించడం మొదలు పెట్టారు. ఇంకో చిల్లర పని కూడా చేస్తే ఆయనను సూపరింటెండెంట్‌ సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత 6 నెలలకు అతను గుండెపోటు వచ్చి చనిపోతే హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ వల్లనే చనిపోయారని ధర్నా చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చనిపోయిన అతని భార్యకు ఉద్యోగం పెట్టించిన. కానీ.. నిన్న ఆ ఊరికి నేను పోతే ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టి తిట్టిపించారు’అని అన్నారు.   

మరిన్ని వార్తలు