కేసీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారు

22 Jul, 2021 04:51 IST|Sakshi
రైతులు, కూలీలతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

 ప్రజాదీవెన పాదయాత్రలో ఈటల రాజేందర్‌

కమలాపూర్‌/ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఎన్నికల కోసమే దళితబంధు అనడం, అది కూడా హుజూరాబాద్‌కు మాత్రమే అని ముఖ్యమంత్రి బరితెగించి మాట్లాడతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రానున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ఓట్లతోనే గుణపాఠం చెప్పాలని, ఆ దిశగా ప్రజలను చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలంలో మూడో రోజు ఈటల ప్రజాదీవెన పాదయాత్ర కొనసాగింది.

అనంతరం పాదయాత్ర కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలంలోకి ప్రవేశించింది. యాత్రలో భాగంగా ఆయన రైతుకూలీలతో ముచ్చటించారు. పలుచోట్ల జరిగిన సభల్లో ఈటల మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంకంటే ఇప్పుడే ఎక్కువ నిర్బంధం ఉందని, పాదయాత్ర సందర్బంగా తాను వెళ్తున్న గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిపి వేస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, బొడిగె శోభ, బీజేపీ వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్‌ పాల్గొన్నారు. 

విశ్వేశ్వర్‌రెడ్డి సంఘీభావం 
ఈటల రాజేందర్‌ చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్రకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మంగళవారం జరిగిన పాదయాత్ర సందర్భంగా భోజన విరామ సమయంలో విశ్వేశ్వర్‌రెడ్డి గూడూరులో ఈటలతోపాటు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అరగంట పాటు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విలేకరులు బుధవారం మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వాస్తవమేనని చెప్పారు.   

మరిన్ని వార్తలు