కోవర్టులకే టీఆర్‌ఎస్‌లో పదవులు

6 Aug, 2021 01:21 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఈటల

ఈటల రాజేందర్‌ ధ్వజం 

ఉద్యమ ద్రోహులే ఇప్పుడు రాజ్యమేలుతున్నారు 

నన్ను ఓడించేందుకు ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు 

సాక్షి, హైదరాబాద్‌ / హుజూరాబాద్‌:  టీఆర్‌ఎస్‌లో ఉద్యమ సహచరులెవరూ లేరని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న వాళ్లంతా ఉద్యమ ద్రోహులేనని, వారే రాజ్యమేలుతున్నారని విమర్శించారు. అసలు సిసలైన ఉద్యమకారులందరినీ బయటికి గెంటేసి ద్రోహులు, కోవర్టులకు పదవులు కట్టబెడుతున్నారన్నారు. 2018లో కోవర్టుగా పని చేసిన కౌశిక్‌రెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పారు. మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి, నాటి ఉద్యమకారుల గుండెలను మరింత గాయపర్చారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో మోకాలికి శస్త్రచికిత్స అనంతరం గురువారం డిశ్చార్జి అయిన ఈటల మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్‌ దళిత ద్రోహి 
కేసీఆర్‌ దళిత ద్రోహి అని ఈటల ఆరోపించారు. ఆయన్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు. ప్రజలకు అందించే ప్రభుత్వ పథకాలకు రూపకల్పన చేసే కీలకమైన సీఎంఓలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధి కారి కూడా లేడని తెలిపారు. గత ఏడేళ్లలో ఒక్కసారి కూడా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయడానికి రాని కేసీఆర్, హుజూరాబాద్‌ ఎన్నికల దృష్ట్యా దళితులపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో తన అనుచరులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. హుజురాబాద్‌ ఎన్నికలు అనగానే పింఛన్లు, దళితబంధు, రేషన్‌కార్డులు వచ్చాయని విమర్శించారు. ఇదే క్రమంలో నిరుద్యోగభృతి కూడా ఇవ్వాలని ఈటల డిమాండ్‌ చేశారు.  

ఆగినచోట నుంచే త్వరలో పాదయాత్ర  
హైదరాబాద్‌ నుంచి హుజూరాబాద్‌ చేరుకున్న ఈటల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తన పాదయాత్ర ఆగినచోట నుంచే త్వరలో మళ్లీ ప్రారంభిస్తానని తెలిపారు. హుజూరాబాద్‌లో ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ కుట్రలు చేస్తోందన్నారు.  

మరిన్ని వార్తలు