EtelaRajender: గొర్రెల మంద మీద తోడేళ్ల దాడి ఇది

16 May, 2021 03:21 IST|Sakshi
ఈటల రాజేందర్‌ను కలసిన ఇల్లందకుంట ప్రజాప్రతినిధులు

సర్పంచులు, ఎంపీటీసీలకు బెదిరింపులపై ఈటల మండిపాటు 

ఉద్యమానికి సంబంధం లేని మంత్రి భయపెడుతున్నాడు 

జిల్లా నేతలను 20 ఏళ్లుగా కడుపులో దాచుకున్నా 

వారిని నా నుంచి వేరు చేయాలని చూస్తున్నారు 

మంత్రి గంగులపై పరోక్ష విమర్శలతో వీడియోలు విడుదల 

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌లో జరుగుతున్న రాజకీయాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భగ్గుమన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్‌ జోక్యంపై ఆయన ధ్వజమెత్తారు. కరోనా తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిన మంత్రి గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్లు హుజూరాబాద్‌లోని సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలను బెదిరింపులకు గురిచేసి తన నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ వీడియో విడుదల చేశారు. ‘తెలంగాణలో కోవిడ్‌ సోకి గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చనిపోతున్నారు. స్వయంగా సీఎం రివ్యూ పెట్టి ఏ లోటు లేకుండా చూస్తానని మాటిచ్చి, ఏ జిల్లాలో మంత్రులు ఆ జిల్లాలో కోవిడ్‌ సేవలు పర్యవేక్షించాలని చెప్పారు. కరీంనగర్‌ జిల్లాలో మాత్రం కోవిడ్‌ పేషెంట్లను, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి హుజూరాబాద్‌ ప్రజాప్రతినిధుల మీద గొర్ల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్లు వ్యవహరిస్తున్నారు. 20 ఏళ్లుగా ఆ జెండాను కాపాడి, ఉద్యమానికి ఊపిరి పోసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన జిల్లా మీద ఉద్యమంతో సంబంధం లేని మంత్రి, సీఎం నియమించిన కొంతమంది ఇన్‌చార్జీలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు ఫోన్‌ చేసి ‘మీ పదవులు ఊడిపోతయ్‌’, ‘సర్పంచులకు బిల్లులు రావ్‌’, ‘సర్పంచులు మాతో వస్తే రూ.50 లక్షలు, రూ.కోటి ఫండ్స్‌ ఇస్తం’అంటూ బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడుతున్నారు, కాంట్రాక్టర్లకు బిల్లులు రావని, స్కూళ్ల యజమానులకు పర్మిషన్లు రద్దు చేస్తామని బెదిరిస్తూ నీచానికి ఒడిగడుతున్నరు. వారికి ఇష్టం లేకపోయినా నాకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించి వికృతానం దం పొందుతున్నారు. పిడికెడు మందిని ప్రలోభాలకు గురిచేసి ప్రజాభిప్రాయాన్ని మారుస్తానని అనుకోవడం వెర్రి బాగులతనమే. హుజూరాబాద్‌ ప్రజలు చాలా   చైతన్యవంతమైన వారు.. ఇలాంటి చిల్లర మల్లర చర్యలను తిప్పికొడతారు. వీరు ఎప్పుడన్నా నియోజకవర్గానికి వచ్చారా? ఒక సర్పంచిని, ఎంపీటీసీ, కౌన్సిలర్‌ను గెలిపించారా? పిచ్చివేశాలు మానుకొని కోవిడ్‌ పేషెంట్లను కాపాడుకొనే పనులు చేయండి. సమైక్య రాష్ట్రంలో కూడా కరీంనగర్‌లో ఇ లాంటివి చేసి విఫలమయ్యారు’అని మంత్రి గంగుల పేరు ప్రస్తావించకుండా ఈటల విమర్శించారు. 


సహించేది లేదు.. 
మరో వీడియోలో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా కష్టపడుతున్న వారిని మనోవేదనకు గురిచేస్తే సహించేది లేదని ఈటల స్పష్టం చేశారు. ‘20 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్న వారిని కోడి రెక్కల కింద తన పిల్లలను దాచుకున్నట్లు కాపాడుకుంటున్నా.. ఇప్పుడు ఇలాంటి వారు వచ్చి తల్లిని, పిల్లని వేరు చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. మా నేతలను, కార్యకర్తలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రలోభ పెడితే, ఇబ్బంది పెడితే కొంతమంది మాట్లాడుతుండొచ్చు. కానీ వారి అంతరాత్మ మాత్రం నా లాంటోని మీదనే ఉంటుంది’అని వ్యాఖ్యానించారు. 

ఈటలతోనే మేం.. 
ఇల్లందకుంట మండలానికి చెందిన ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్‌తో పాటు వైస్‌ చైర్‌పర్సన్‌ ఆరెల్లి జోత్స్న, ఇల్లందకుంట సర్పంచ్‌ కంకణాల  శ్రీలతతో పాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శనివారం హైదరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను కలసి మద్దతు ప్రకటించారు. భవిష్యత్‌లో ఈటల తీసుకునే నిర్ణయాలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగి ఒకరిద్దరు తమ వెంట రాకున్నా, మండలంలోని ప్రజలు, కార్యకర్తలు, నేతలు ఈటల వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు