హుజురాబాద్‌కు ఈటల.. తొలిసారి కాషాయ కండువాతో..

17 Jun, 2021 19:09 IST|Sakshi

కాషాయ కండువాతో  తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టిన ఈటల

హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో రోడ్ షో

సాక్షి, కరీంనగర్‌ జిల్లా: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాషాయ కండువాతో  తొలిసారి నియోజకవర్గంలో అడుగు పెట్టారు. దారి పొడవునా అభిమానులు, బీజేపి కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్ షో నిర్వహించగా ఆయన సతీమణి జమున కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల మద్దతు కోరారు. ఈటల దంపతుల తొలి రోజు ప్రచారం బీజేపీకి కొత్త ఊపునివ్వగా.. గులాబీ శ్రేణుల్లో గుబులు మొదలైంది.

జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికతో ప్రజలు.. టీఆర్ఎస్ అహంకారానికి  ఘోరీ కడతారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికలకు.. ఈ ఉప ఎన్నిక రిహార్సల్‌గా ఆయన అభివర్ణించారు. తనకు మద్దతిస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఈటల ఆరోపించారు. ప్రజలు ప్రేమకు లొంగుతారని. బెదిరింపులకు కాదనన్నారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మ గౌరవం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మ గౌరవం పోరాటానికి హుజురాబాద్ వేదిక అని రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

చదవండి: Huzurabad: టార్గెట్‌ ఈటల..పెద్దిరెడ్డి మాటల వెనుక అర్థం ఏమిటో? 
‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు

మరిన్ని వార్తలు