బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌

14 Jun, 2021 14:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు. సోమవారం ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇటీవల టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పిన ఈటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు.

ఈ కార్యక్రమానికి  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు,  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా  ఈటల రాజేంద్రర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు.

కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి ఈటల బృందం వెళ్లనుంది. ఈటల రాజేందర్‌కు  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పనున్నారు. ఈటలతో పాటు వచ్చిన ఇతర అనుచరులకు తన నివాసంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పార్టీ నేతలందరికీ తన నివాసంలో లంచ్ ఏర్పాటు చేయనున్నారు.  అనంతరం ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఈటల రాజేందర్‌ కలవనున్నారు.
 
భూఆక్రమణల ఆరోపణలు నేపథ్యంలో ఈటల రాజేందర్‌.. కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటలను ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసింది. అనంతరం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్‌  నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం అయింది.


చదవండి: ప్రభుత్వ భూములు ఎవరూ కొనొద్దు 

మరిన్ని వార్తలు