Huzurabad: పట్టుబిగిస్తున్న అధిష్టానం.. ఈటల ఒంటరేనా?!

20 May, 2021 10:29 IST|Sakshi

హుజూరాబాద్‌పై పట్టు బిగిస్తున్న అధిష్టానం

టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరూ వెళ్లకుండా కార్యాచరణ

కమలాపూర్‌లో రాజేందర్‌పై నిరసన గళం

స్వరం పెంచిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

టీఆర్‌ఎస్‌ వైపే మెజార్టీ నేతలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు టీఆర్‌ఎస్‌ కేడర్‌ను దూరం చేసేలా పార్టీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. రాజీనామా చేయకుండా పోటాపోటీగా ప్రెస్‌మీట్ల ద్వారా ఎదురుదాడి చేస్తున్న ఆయనను ఒంటరిని చేసేందుకు వ్యూహం అమలు చేస్తోంది. ఒకవేళ రాజేందర్‌ పార్టీ వీడినా టీఆర్‌ఎస్‌ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేజారకుండా హుజూరాబాద్‌ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ పట్టు బిగిస్తోంది. సుమారు వారం పాటు స్థబ్దత నెలకొనగా... రెండు రోజులుగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఇన్ని రోజులు వేచిచూసే ధోరణి ప్రదర్శించిన నాయకులు ‘కేసీఆర్‌ నాయకత్వంలో పని చేస్తాం... టీఆర్‌ఎస్‌లోనే ఉంటాం’ అని ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్‌పై ‘ఆపరేషన్‌ గంగుల’ పేరిట బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాపూర్‌ కమలాపూర్, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్‌ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటుండగా, త్వరలోనే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ట్రబుల్‌ షూటర్‌ టి.హరీష్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ రంగంలోకి దిగుతారన్న ప్రచారం కమలాపూర్‌లో సాగుతోంది. 

ఫలిస్తున్న టీఆర్‌ఎస్‌ వ్యూహం....
మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం అమలు చేస్తున్న వ్యూహాలు సత్పలితాలు ఇస్తున్నాయి. రాజేందర్‌ తాజాగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించి వెళ్లాక పరిస్థితులు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఇరవై రోజుల పాటు వేచిచూసిన పలువురు టీఆర్‌ఎస్‌ సీనియర్లు బుధవారం ప్రెస్‌మీట్ల ద్వారా తమ వైఖరి స్పష్టం చేశారు.

కరోనా తగ్గుముఖం పట్టాక తర్వాత తన రాజకీయ భవిష్యత్‌ నిర్ణయం ప్రకటిస్తానని ఈటల రాజేందర్‌ స్పష్టం చేస్తుండగా, ఒక్కొక్కరుగా ఆయన శిబిరం నుంచి బయట పడుతున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన సమయంలో రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పలువురు ఇప్పుడు పక్కకు తప్పుకుంటున్నారు. కరీంనగర్‌లో మకాం వేసిన గంగుల కమలాకర్‌ను కలిసొచ్చి హుజూరాబాద్, కమలాపూర్‌ల్లో ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. 

కేటీఆర్‌ నాయకత్వంలో పని చేస్తాం
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న పలువురు సీనియర్లతో పాటు మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు గులాబీ జెండా కిందే పని చేస్తామని బుధవారం ఖరాకండిగా ప్రకటించారు. కమలాపూర్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ పార్టీలోనే కొనసాగుతూ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో పని చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పీఏసీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, పింగిలి ప్రదీప్‌ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గందె రాధికా శ్రీనివాస్, వైస్‌చైర్మన్‌ కొలిపాక నిర్మల శ్రీనివాస్, ఎంపీటీసీలు తాళ్లపెల్లి శ్రీనివాస్‌ తదితరులు ప్రెస్‌మీట్‌లో ఈటల రాజేందర్‌ వైఖరిని ఖండించారు. టీఆర్‌ఎస్‌లోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని, డబ్బులు, ప్రలోభాలకు లొంగే నాయకులు టీఆర్‌ఎస్‌లో, నియోజకవర్గంలో లేరని వెల్లడించారు.  

చదవండి: హుజురాబాద్‌​: హరీశ్‌కు బాధ్యతలు అప్పగిస్తారా?

మరిన్ని వార్తలు