హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమం

9 Jun, 2021 05:31 IST|Sakshi
మంగళ హారతులతో ఈటల రాజేందర్‌కు స్వాగతం పలుకుతున్న మహిళలు

రేపు జరగబోయేది ధర్మం, అధర్మానికి మధ్య యుద్ధం

ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలను కొనలేరు

నిందలు వేస్తే బొందపెడ్తారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

కమలాపూర్‌: ‘ఆనాడు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌ కేంద్ర బిందువైతే.. ఆ కరీంనగర్‌ను కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఈనాటి హుజూరాబాద్‌. ఇవాళ ఆత్మగౌరవం, అణ గారిన వర్గాల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోస మే కాకుండా అణచివేత నుంచి ప్రజల్ని ముందుకు నడిపించడం కోసం హుజూరాబాదే గొప్ప ఉద్యమ క్షేత్రంగా మారి మరో ఉద్యమానికి నాంది పలకబో తోంది..’అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించాక తొలిసారి ఆయన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని స్వగ్రామమైన కమలాపూర్‌కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం
కొందరు వ్యక్తులు తొత్తులుగా మారిపోయి ఇవాళ తమ నాయకులు, ప్రజలపై అవాకులుచవాకులు పేలుస్తున్నారని ఈటల మండిపడ్డారు. ‘వారందరికీ ఇదే హెచ్చరిక.. మీరు వాళ్లిచ్చిన రాతలు పట్టుకుని మా మీద నిందలు వేస్తే, మా ప్రజలను అవమానిస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం’అని హెచ్చరించారు. ధర్మానికి, అధర్మానికి మధ్య రేపు హుజూరాబాద్‌లో సంగ్రామం జరగనుందని తెలిపారు. ఇరవై ఏళ్లపాటు ఉద్యమ జెండా ఎత్తి ఇవాళ భంగపాటుకు గురైన వాళ్లందరూ తప్పకుండా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వస్తారని చెప్పారు. ధర్మానిదే గెలుపని, హుజూరాబాద్‌ ప్రజలదే విజయం తప్ప అబద్ధాల కోరులకు ఎప్పటికీ విజయం చేకూరదన్నారు.  

ప్రజలు గొప్పగా ఆశీర్వదిస్తున్నారు..
‘బిడ్డా.. నీకు అన్యాయం జరిగింది. 20 ఏళ్ల పాటు గులాబీ జెండాను, తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నావు.. ఇవాళ తెలంగాణకు మోసం చేసిన వాళ్లను పక్కన పెట్టుకుని కష్టకాలంలో అండగా ఉండి ఉద్యమాన్ని నడిపిన నీలాంటి వాడికి ద్రోహం చేయడం కేసీఆర్‌కు తగదు. రేపు నీ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు తప్పకుండా బుద్ధి చెప్పి తీరుతామంటూ ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు’అని ఈటల చెప్పారు. ‘ఇరవై ఏళ్లు నీ వెంట ఉన్న నాయకుల మీద, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధుల మీద దాడులకు పాల్పడుతూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అక్రమంగా సంపాదించిన వందల కోట్లతో మనుషులను కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రజలను మాత్రం ఎవరూ కొనలేరు.. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నం. మా సంపూర్ణ ఆశీర్వాదం మీకే ఉంటది. తప్పకుండా మళ్లీ నీకే విజయం కట్టబెడతం బిడ్డా.. ముందుకు పో’అని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీపీ తడక రాణి, నేతలు తుమ్మేటి సమ్మిరెడ్డి, వలిగె సాంబరావు  తదితరులు పాల్గొన్నారు.

13 లేదా 14న బీజేపీలోకి ఈటల
పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్‌: రాష్ట్ర బీజేపీ  
సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈనెల 13 లేదంటే 14న బీజేపీలో చేరనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్రువీకరించారు. జేపీ నడ్డా సమయాన్ని బట్టి ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ఆయన బీజేపీలో చేరతారని సంజయ్‌ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఈటలను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ పెడితే టీఆర్‌ఎస్‌ను తట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చనే శ్రేయోభిలాషుల సూచనల మేరకు కమలదళంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఈటల గత నెల 31న ఢిల్లీలో నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపారు. 13 లేదా 14న ఈటల ఇతర నేతలు, అనుచరులతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు