నాపై ఈగ వాలినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊరుకోదు.. ఈటల హెచ్చరిక 

3 Nov, 2022 09:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తన హత్యకు కుట్ర జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని చెప్పారు. సీఎం ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, పక్కా స్కెచ్‌ ప్రకారమే మంగళవారం మునుగోడులో తనపై దాడి జరిగిందని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో తన వెంట గన్‌మెన్లు లేకపోతే తన తలకాయ ఉండేది కాదని ఈటల పేర్కొన్నారు.

తనను చంపి బతికి బట్ట కట్టగలమని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తనపై ఈగ వాలినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ దాడి ఘటనలో తన పీఆర్‌ఓ చైతన్య, గన్‌మ్యాన్‌ అంజయ్యలకు గాయాలయ్యాయని తెలిపారు. తమ మీటింగ్‌ వద్దకు వచ్చి దాడిచేసి, వారిపైనే దాడి చేసినట్టు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓటమితో తనపై కేసీఆర్‌ పగ పట్టారని ఆరోపించారు. తన కాన్వాయ్‌పై దాడి చేసేందుకు అనేకసార్లు ప్రయత్నాలు జరిగాయన్నారు. హుజూరాబాద్‌లో అవసరం లేకున్నా అనేకమందికి గన్‌ లైసెన్సులు ఇచ్చారని విమర్శించారు.  

రాళ్లు రువ్వారు..జెండా కర్రలతో కొట్టారు 
పలివెల గ్రామంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారాన్ని సైతం అడ్డుకున్నారన్నారు. కేంద్ర మంత్రికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని, పోలీసు వ్యవస్థ ఏమి చేస్తోందని ఈటల ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని, జెండా కర్రలతో కొట్టారని చెప్పారు. డీఎస్పీని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి కొట్టారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్క కారుతో అర్ధరాత్రి కూడా తిరిగే వాళ్ళమని, కేసీఆర్‌ హయాంలో బయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. మునుగోడులో కేసీఆర్‌ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని, తొమ్మిదేళ్లు ఏమీ చెయ్యకుండా.. మొన్న వచ్చి 15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రిని కడతా, రోడ్లు వేయిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు.    
చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌

మరిన్ని వార్తలు