కవిత పాత్ర దర్యాప్తులో తేలుతుంది 

2 Dec, 2022 01:08 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను పడగొట్టాల్సిన అవసరం మాకులేదు: ఈటల  

సాక్షి.హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందా? లేదా? అన్న విషయం దర్యాప్తులో బయటపడుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణలో చేసిన దోపిడీ చాలదన్నట్టుగా కేసీఆర్‌ కుటుంబం, దోచుకోవడానికి ఢిల్లీ మీద పడిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడ ధరణి పేరిట వేలాది ఎకరాల భూములను చెరబట్టి, పేదల భూములను మాయం చేసి, వేలకోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు.

తనలాంటి వారిని ఓడించేందుకు ఆ అక్రమ సంపాదన ఖర్చు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్క్‌ వద్ద పోలీస్‌ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా ఈటల, ఇతర సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘అమరవీరుల త్యాగాల సాక్షిగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఐక్యమవుదాం.. ఈ నియంత పాలన అంతం చేద్దాం’అని పిలుపునిచ్చారు. 

అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 
‘2014 వరకు అటుకులు బుక్కి, ఉపాసముండి ఉద్యమాలు నడిపిన పార్టీ తమదని కేసీఆర్‌ చెప్పేవారు, అధికారంలోకి వచ్చాక వేలకోట్ల రూపాయలు ఉప ఎన్నికలలో ఖర్చుపెట్టి, ఓట్లను కొనుక్కునే స్థాయికి ఎలా వచ్చారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ అకౌంట్‌లో రూ.870 కోట్ల వైట్‌ మనీ ఎక్కడి నుంచి వచ్చింది..ఈ విషయాన్నీ ప్రజలు ఆలోచించాలి’అని ఈటల అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన, అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టంచేశారు. చాలామంది కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరుతామని అడుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించడం.. దొంగే దొంగ అన్నట్టుగా ఉందని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు