హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల

8 Jun, 2021 13:21 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ మరో ఉద్యమానికి నాంది కాబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అబద్ధాలకోరులు తమని అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఆయన మంగళవారం హుజూరాబాద్‌ నియాజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కమలాపురం మండలం శంభునిపల్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి హుజూరాబాద్‌ ప్రజలు ఊపిరిపోయాలన్నారు. ప్రగతిభవన్‌ నుంచి వచ్చే స్క్రిప్ట్‌ను చదవడమే కొందరి పని అని ఆరోపించారు. తన గురించి మాట్లాడేవారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానని, 19ఏళ్లు తెలంగాణ ఉద్యమం కోసం పని చేశానని చెప్పారు.

త్వరలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మానికి, అధర్మానికి యుద్ధం జరుగుతుందని, హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఎన్నిక జరగబోతుందని తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఢిల్లీ పర్యటన తర్వాత మొదటిసారి హుజూరాబాద్‌ వెళ్లడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

చదవండి: Huzurabad: ఉప ఎన్నికపై గులాబీ వ్యూహం

మరిన్ని వార్తలు