Etela Rajender: బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు

10 Jun, 2021 18:25 IST|Sakshi

ముహుర్తం ఫిక్స్‌ చేసిన మాజీ మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారయ్యింది. ఈ నెల 14న ఆయన కాషాయ కండువా కప్పుకొనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు. ఈటలపై భూ కబ్జా ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వెడేక్కాయి. కావాలనే కక్ష్య కట్టి కేసీఆర్‌ ఇదంతా నడిపిస్తున్నారని ఈటల ఆరోపించారు. పార్టీలో అవమానాలు తప్ప ఆత్మీతయత లేదని వాపోయారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. 

ఆ తర్వాత ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత ఈటల తన సన్నిహితులతో తదుపరి కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈటల బీజేపీ గూటికి  చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

ఈటల రాజీనామా నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరగనుంది. కోవిడ్‌ ఉధృతి తగ్గిన తర్వాత త్వరలోనే ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈటలను రాజకీయంగా ఒంటరిని చేసే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ అమలు చేస్తోంది. అక్కడ బీజేపీకి గల బలంపై నాయకులు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో మోదీ హవాలో కరీంనగర్‌ను గెలుచుకున్న బీజేపీ హుజూరాబాద్‌లో మాత్రం మూడోస్థానంలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీకి ఈటలతో బలం పెరుగుతుందే తప్ప బీజేపీ వల్ల ఈటలకు ఉపయోగం లేదని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈటల ఇమేజ్‌ను దెబ్బకొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్‌ నాయకులు చర్చించారు.  

చదవండి: 
హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమం

భారీ మద్దతు: మేమంతా ‘ఈటల’ వెంటే..

మరిన్ని వార్తలు