Etela Rajender: ఈటలపై ‘ఆపరేషన్‌ గంగుల’!

17 May, 2021 00:45 IST|Sakshi

ఏకాకి చేయడమే లక్ష్యంగా మంత్రి పావులు 

హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలతో వరుస భేటీలు 

పార్టీ యంత్రాంగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కసరత్తు 

ప్రత్యామ్నాయ నాయకత్వ అన్వేషణలో పార్టీ అధినేత కేసీఆర్‌ 

నేడు హుజూరాబాద్‌కు రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురై ఇరవై రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ను వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు గతంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ వీడిన వారితో ఈటల వరుస భేటీలు జరుపుతూ టీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుకు సంబం«ధించిన నిర్ణయం ప్రకటిస్తానని ఈటల స్పష్టం చేశారు. సొంత పార్టీ పెట్టడం, వేరే పార్టీలో చేరడంపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఇప్పటికే ప్రకటించారు. అయితే టీఆర్‌ఎస్‌ మాత్రం ఈటల నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో పార్టీ యంత్రాంగాన్ని వేరు చేసి తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించారు. 

హుజూరాబాద్‌లో... 
ఈటల రాజేందర్‌ను కలిసి సంఘీభావం ప్రకటించిన హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్‌ వరుసగా సమావేశమవుతున్నారు. కరీంనగర్‌లో మకాం వేసిన గంగులతో వారం రోజులుగా హుజూరాబాద్‌ నేతలు కలుస్తున్నారు. ఈటల రాజకీయంగా ఎదిగేందుకు పార్టీ ఇచ్చిన అవకాశాలను గుర్తు చేస్తూ, ఆయన పార్టీకి ద్రోహం చేసేందుకు సిద్ధపడినందునే బయటకు పంపామని గంగుల ‘బ్రెయిన్‌ వాష్‌’చేస్తున్నారు.

పార్టీ వెంట నడిస్తే ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూనే, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని చెప్తున్నారు. దీంతో గంగులను కలిసిన ప్రజాప్రతినిధులు పార్టీ వెంటే నడుస్తామని ప్రకటనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఈటలకు వీలైనంత త్వరగా దూరం చేయడం ద్వారా ఆయనను రాజకీయంగా ఏకాకిగా చేయాలనే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ అనుసరిస్తోంది. 


ఈటలకు దూరంగా జరుగుతున్న నేతలు 
ఈటలకు ప్రధాన అనుచరులుగా ఉన్న కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు గంగులతో భేటీ అయి పార్టీ నాయకత్వం వెంటే నడుస్తామని ప్రకటిస్తున్నారు. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మ్యాకల ఎల్లారెడ్డి, జమ్మికుంట వైస్‌ చైర్మన్‌ వంటి ఒకరిద్దరు మాత్రమే ఈటలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.

ఈటలను ఒంటరి చేసేందుకు గంగుల కమలాకర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిస్తుండటంతో తర్వాతి కార్యాచరణపై దృష్టి సారించారు. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి హుజూరాబాద్‌లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్‌ పర్యటనలో పెద్ద ఎత్తున స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల ప్రభావాన్ని తట్టుకునే ప్రత్యామ్నాయ నాయకత్వంపై పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టి సారించారు. ఈటల సోమవారం హుజూరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం.  

ఈటలను కలిసిన కొండా దంపతులు  
మేడ్చల్‌ రూరల్‌: మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్‌ను శామీర్‌పేటలోని ఆయన నివాసంలో ఆదివారం వరంగల్‌కు చెందిన కొండా సురేఖ, ఆమె భర్త మురళి కలిశారు. వీరు మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపినప్పటికీ, భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు