రాజ్యసభ రగడ: విపక్ష ఎంపీలపై కేంద్రం సీరియస్

13 Aug, 2021 14:28 IST|Sakshi

రాజ్యసభలో విపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనపై కేంద్రం సీరియస్‌

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సమావేశానికి పిలుపు

కేంద్రం ఫిర్యాదుపై చర్చించనున్న ఎథిక్స్ కమిటీ 

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆందోళన వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. రాజ్యసభలో గందరగోళానికి  కారణమైన విపక్ష ఎంపీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రతిపక్ష సభ్యలు అనుచిత ప్రవర్తనపై  కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ చీఫ్ శివ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని రాజ్యసభ ఎథిక్స్ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది.

ఈ సమాశేంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు బుధవారం కొంతమంది ప్రతిపక్ష సభ్యులు మార్షల్స్‌పై  దాడి చేయడంతోపాటు, హౌస్ ఆస్తులను ధ్వంసం చేశారన్న ప్రభుత్వం ఫిర్యాదుపై చర్చించనుంది. మరోవైపు  సభలో ప్రతిపక్షాలు,  ట్రెజరీ  ఆస్తులు రెండూ సమానమేనని, రెండూరెండు కళ్లలాంటివని రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రకటించడం గమనార్హం.

కాగా పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై మండిపడిన విపక్షాలు కేంద్రం విమర్శలు గుప్పించాయి. బయటి వ్యక్తులకు మార్షల్స్ డ్రస్‌లు వేసి బుధవారం పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి మహిళా ఎంపీలపై దాడి చేయించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో  విపక్ష ఎంపీలే  క్రమశిక్షణ ఉల్లంఘించి దురుసుగా ప్రవర్తించారని కేంద్రం కౌంటర్‌ ఎటాక్‌ చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేసింది. కాగా సభలో జరిగిన పరిణామాలపై  రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు