-

RS Praveen kumar: సీఎంగా కేసీఆర్‌ ఏడేళ్లు ఏం చేశారు..? 

29 Aug, 2021 08:44 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, ఆదిలాబాద్‌: బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేపట్టాలని మాజీ ఐపీఎస్‌ అధికారి, బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన శనివారం ఆదిలాబాద్‌కు వచ్చారు. అర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి ఆది లాబాద్‌ జిల్లాలోని బీఎస్పీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కుమ్మరివాడకు వెళ్లి కుండలు తయారు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.

భుక్తపూర్‌ కాలనీకి వెళ్లి కావేరి, మహిపాల్‌ దంపతులతోపాటు పలువురు మేదరులతో మాట్లాడారు. తర్వాత జనార్దన్‌రెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్, కాన్షీరాం, మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పార్టీలను వదిలి బీఎస్పీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల రాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

బాంచన్‌ బతుకుల కాలం పోయిందని, గులాబీ తెలంగాణ నీలి తెలంగాణగా మారుతుందని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి విషయంలో సీఏం కేసీఆర్‌ ఏడేళ్లు ఎందుకు పథకాలను అందించకుండా నిద్రపోయారని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానని కేవలం 10 వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శ్మాశనవాటికలు, రైతు వేదికలు, ఇతర భవనాలను నిర్మించేందుకు అసైన్డ్‌ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కులవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌ మంద, కోఆర్డినేటర్‌ గంగాధర్, జిల్లా ఇన్‌చార్జి మెస్రం జంగుబాపు, తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ

   

మరిన్ని వార్తలు