మేఘాలయలో కాంగ్రెస్‌కు ఝలక్‌!

25 Nov, 2021 04:51 IST|Sakshi

18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలోకి జంప్‌

మాజీ సీఎం ముకుల్‌ సంగ్మా కూడా

న్యూఢిల్లీ: నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో తాజాగా తలబొప్పి కట్టింది. అసెంబ్లీలో పార్టీకి ఉన్న 18 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాతోతో సహా ఏకంగా 12 మంది బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. మేఘాలయ అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న ముకుల్‌ సంగ్మా కొంతకాలంగా కాంగ్రెస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

మేఘాలయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా విన్సెంట్‌ హెచ్‌. పాలాను నియమించినప్పటి నుంచి ముకుల్‌ సంగ్మాకు ఆయనతో పొసగడం లేదు. తన అభిప్రాయానికి విలువివ్వకుండా విన్సెంట్‌ నియామకం జరిగిందనేది ఆయన కినుక. చివరకు సంగ్మా టీఎంసీ గూటికి చేరారు. 2023లో జరగనున్న మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే టీఎంసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త, మమతా బెనర్జీకి సన్నిహితుడైన ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన బృందం కొంతకాలంగా షిల్లాంగ్‌లో మకాం వేసి క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై సర్వే చేస్తోంది. ఇప్పుడు ముకుల్‌ సంగ్మా చేరికతో టీఎంసీ ఒక్కసారిగా బలపడినట్లైంది.  

మరిన్ని వార్తలు