‘పాలమూరు ఎత్తిపోతల కాదు.. ఉత్తిపోతల పథకం’

9 Aug, 2021 09:03 IST|Sakshi

సాక్షి, పరిగి( వికారబాద్‌): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి గడ్డంప్రసాద్‌కుమార్, మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. కృష్ణాజలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సాధనకై ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో అఖిలపక్షం నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కావాలనే పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఆపేశారన్నారు. ఆ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తరలించారన్నారు. ప్లానింగ్‌ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిధులన్నీ తన సొంత జిల్లాలకే తీసుకెళ్లి పనులు చేపడుతున్నారని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ నిధులను సైతం తన  ప్రాంతాలకు తరలించారన్నారు. రోజుకు కొత్త మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.  లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్‌ 10 టీఎంసీలు ఉంటే దాన్ని ఒక టీఎంసీకి మార్చారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో సామర్థ్యాన్ని పునరుద్ధరించారన్నారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం ప్రధానమంత్రికి కూడా వినతిపత్రం అందించామన్నారు.

అధికార పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించి మన ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చేందుకు కృషిచేయాలన్నారు. మన ప్రాంతాలకు జలాలను తెచ్చుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయ పార్టీల ముఖ్య నాయకులు హన్మంతుముదిరాజ్, భీంరెడ్డి, రాముయాదవ్,  శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు