సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్‌: పేర్ని నాని

18 Sep, 2022 16:52 IST|Sakshi

సాక్షి, అమరావతి: చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు అసలు పొంతనే లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి పోరాటం చేశారని ప్రస్తావించారు. ఆయన ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు గెలిచారని గుర్తు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్‌ మాట్లాడుతున్నారని అన్నారు. తాను మాత్రం చాలా పునీతుడిని అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో పవన్‌ చేసినన్నీ తప్పులు చిరంజీవి చేయలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మళ్లీ కనిపించలేదని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీని పవన్‌ ఎందుకు వదిలేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు పేర్నినాని ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజారాజ్యం పార్టీకి, సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్‌ అని దుయ్యబట్టారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్‌.. ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘గతంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్‌ ఏం చేశారు. గతంలో పవన్‌ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి. 2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్‌ 2014 అదే వ్యక్తికి ఓటు వేయమని ప్రజల్ని కోరాడు. హైదరాబాద్‌ను విడిచి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన వారిని పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు గురించి ఒక్కరోజైనా పవన్‌ ప్రశ్నించారా? అలాంటి పవన్‌ కల్యాణ్‌ది రాజకీయ పార్టీ ఎలా అవుతుంది. వారాంతపు ప్రజానాయకుడు పవన్‌ కల్యాణ్‌ భ్రమలో ఉన్నారు’ అని నాని పేర్కొన్నారు.
చదవండి: విశాఖ పర్యాటకాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌

మరిన్ని వార్తలు