నా మాటల్ని వక్రీకరించారు: రాజా

1 Apr, 2021 14:52 IST|Sakshi

ఈసీకి రాజా వివరణ 

సాక్షి, చెన్నై: తన వ్యాఖ్యలను వక్రీకరించి బయటకు విడుదల చేశారని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లకు డీఎంకే ఎంపీ రాజా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు.  పెరంబలూరు ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, ఆయన తల్లిని కించపరిచే రీతిలో రాజా వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యకు పట్టుబడుతూ అన్నాడీఎంకే నేతృత్వంలో నిరసనలు సైతం సాగాయి. సీఎం పళనిస్వామి సైతం ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం ఉద్వేగానికి గురికావడంతో మనసు నొప్పించి ఉంటే మన్నించండి అంటూ రాజా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించిన ఎన్నికల కమిషన్‌ వివరణ కోరుతూ రాజాకు నోటీసులు జారీ చేసింది. 

న్యాయవాదితో వివరణ
రాజా స్వయంగా వచ్చి ఈసీ సాహుకు వివరణ ఇస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే తన న్యాయవాది పచ్చయప్పన్‌ ద్వారా రాజా వివరణ లేఖను కేంద్ర, రాష్ట్ర కమిషన్లకు పంపించారు. అందులో తాను ఎన్నికల ఆదాయం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించ లేదని వివరించారు. తానేదో వ్యాఖ్యలు చేసినట్టుగా అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని, వాస్తవానికి తన వ్యాఖ్యల్ని కత్తిరించి, వక్రీకరించి బయటకు వీడియోల రూపంలో విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరిగితే, తాను ఏ తప్పు చేయలేదన్నది, వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టం అవుతోందన్నారు. సీఎం ఉద్వేగానికి గురయ్యారన్న సమాచారంతో ఒక వేళ తానేమైనా తప్పు చేశానా.. అని భావించి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని క్షమాపణ కూడా కోరినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు తనపై మోపిన  ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నకలు అందించాలని, ఆ మేరకు పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు