Etela Rajender: మాజీ మంత్రి వెంటే మాజీ ఎమ్మెల్యే 

28 May, 2021 14:34 IST|Sakshi

 టీఆర్‌ఎస్‌తో రవీందర్‌రెడ్డికి బంధం వీడినట్టే..!

ఎల్లారెడ్డిలో మారనున్న సమీకరణలు

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు దూరమైనట్లే కనిపిస్తోంది! పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చే సిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే మంత్రిమండలి నుంచి బర్తరఫ్‌ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెంట నడుస్తున్నారు. ఆయన కోటరీలో ఒకరిగా ఉంటూ ఆయన వెంటే తిరుగుతున్నారు.

రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయడమా.. ఇతర పార్టీలో చేరడమా? అన్న దానిపై రా జేందర్‌ వేస్తున్న అడుగుల్లో రవీందర్‌రెడ్డి వెన్నంటి ఉండడం గమనార్హం. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారి పోనున్నాయి. 

చదవండి: Etela Rajender: బీజేపీలో చేరికపై బండి సంజయ్‌ క్లారిటీ

గులాబీ జెండా ఆవిర్భావం నుంచి.. 
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన కేడర్‌ ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత నామినేటెడ్‌ పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన జాజాల సురేందర్‌ అనూహ్యంగా గులాబీ గూటికి చేరడం, నియోజక వర్గ బాధ్యతలన్నీ ఆయనకు అప్పగించడంతో రవీందర్‌రెడ్డి ప్రాధాన్యత తగ్గింది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన తనను కాదని సురేందర్‌ను చేర్చుకోవడంతో మాజీ ఎమ్మెల్యే నిరాశ చెందారు. అయితే, పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలతో నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ఆశించారు.

రెండున్నరేళ్లుగా పదవి దక్కక పోగా, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనను, తన అనుచరులను పట్టించుకోక పోవడం రవీందర్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. చివరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ రవీందర్‌రెడ్డికి, ఆయన అనుచరులకు నమోదు పుస్తకాలు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు సమాచారం. అప్పటి నుంచి ఆయన పార్టీ ముఖ్య నేతలకు దూరమవుతూ వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బయటకు పంపింన నేపథ్యంలో రవీందర్‌రెడ్డి.. ఈటలను కలిసి అండగా నిలిచారు. మొదటి నుంచి పార్టీలో కలిసి పని చేసిన వారు కావడం, రవీందర్‌రెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై ఉన్న కోపంతో ఈటలతో కలిసి అడుగులు వేస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌కు కొంత నష్టం..
ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడితే ఎల్లారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ సమీకరణలు మారుతాయని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమాల్లో నియోజక వర్గ ప్రజలు చురకైన పాత్ర పోషించారు. రవీందర్‌రెడ్డి వెంట ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన ఓటమి చెందినా చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆయన వెన్నంటే ఉన్నారు. ఈటల కొత్త పార్టీ పెడితే రవీందర్‌రెడ్డి వెంట ఉన్న వారంతా ఆయనతో కలిసి పార్టీలో చేరే అవకాశాలున్నాయి. అయితే, ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వెంట ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా కాషాయ గూటికి చేరతారని తెలిసింది.

అదే జరిగితే ఎల్లారెడ్డి నుంచి గతంలో బీజేపీ తరఫున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డికి, ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య టిక్కెట్‌ కోసం పోటీ తప్పదు. రవీందర్‌రెడ్డి కమలం గూటికి చేరితే ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి ఒకరిని, జహీరాబాద్‌ ఎంపీ స్థానం నుంచి మరొకరిని నిలిపే అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. కాగా నియోజక వర్గంలో బలమైన కేడర్‌ కలిగి ఉన్న ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడితే అధికార పార్టీకి కొంత నష్టం తప్పదని భావిస్తున్నారు.

ఈటల కోటరీలో ఒకడిగా.. 
మాజీ మంత్రి ఈటల కోటరీలో ఒకరిగా ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్‌ తదితర పార్టీల నేతలను కలవడానికి వెళ్లిన ఈటల వెంట ఆయన ఉన్నారు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడమా.. వేరే పార్టీలో చేరడమా? అన్న విషయంలో జరుగుతున్న చర్చల్లో రవీందర్‌రెడ్డి ఉండడం ద్వారా ఆయన టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు చేసినట్టుగానే భావిస్తున్నారు. తమ చర్చలు, ప్రయత్నాల గురించి రవీందర్‌రెడ్డి తన అనుచరులకు ఎప్పటికప్పుడు స మాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ తో ఇన్నేళ్ల అనుబంధాన్ని తెంచుకున్నట్టే కనిపిస్తోంది. ఏనుగు అనుచరులు చాలా రోజుల నుంచి పార్టీని వీడాలని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఆయన బీజేపీలో చేరుతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. 

మరిన్ని వార్తలు