వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం 

6 Jan, 2023 04:11 IST|Sakshi

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 

మహబూబ్‌నగర్‌ రూరల్‌/హన్వాడ: రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా ఎదుగుతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని కోడూరు, హన్వాడలో జరిగిన బూత్‌ కమిటీ సభ్యుల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడంలేదని శ్రీకాంతాచారి వంటి అనేక మంది త్యాగాలు చేశారని, ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. దీంతో ప్రజలకు న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని, దక్షిణ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని అన్నారు. నెత్తిమీద రూపాయి పెడితే కూడా ఎవరూ కొనుక్కోలేని వ్యక్తి అక్కడ ఎమ్మెల్యే అయ్యారని, కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్లే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు కేవలం ఆరు నెలల్లో కాలం చెల్లనుందన్నారు. ప్రజలు సామాజిక తెలంగాణను కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, జిల్లా ఇన్‌చార్జి భరత్‌గౌడ్‌ తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు