టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్‌ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం

14 Jan, 2023 14:33 IST|Sakshi

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనట్లుగానే వ్యవహారం సాగుతోంది. అందుకే తెలుగు తమ్ముళ్ళలో నుంచి త్యాగయ్యలు బయటకు వస్తున్నారు. అనంతరపురం అర్బన్ నుంచి పవన్ కల్యాణ్ పోటీచేయాలని అక్కడి మాజీ ఎమ్మెల్యే కోరుతున్నారు. పవన్ కోసం తన సీటును త్యాగం చేస్తానని ప్రభాకర చౌదరి ప్రకటించారు. ఈ మాజీ ఎమ్మెల్యే ప్రకటన వెనుక ఉన్న మర్మం ఏంటో చూద్దాం.

త్యాగం వెనక అసలు కథ
అనంతపురం మున్సిపల్ ఛైర్మన్‌గాను.. అర్బన్ ఎమ్మెల్యే గాను పనిచేసిన వైకుంఠం ప్రభాకర చౌదరి తన సీటును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేస్తానంటున్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశంలో పెత్తనం చలాయించే జేసీ బ్రదర్స్ బారి నుంచి తన సీటును కాపాడుకునే లక్ష్యంగా ప్రభాకర చౌదరి ఈ ప్రకటన చేశారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో ప్రభాకర్ చౌదరికి ఎప్పటినుంచో విభేదాలు కొనసాగుతున్నాయి. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నపుడు ప్రతి విషయంలోనూ ప్రభాకర్ చౌదరి జేసీతో విభేదించారు.

జేసీ బ్రదర్స్ కర్రపెత్తనాన్ని సహించేది లేదని పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై ఎప్పటినుంచో ఆగ్రహంగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి... ఇటీవల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ప్రభాకర్ చౌదరి వద్ద కీలక నేతలుగా ఉన్న వారందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు జేసీ. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు  పవన్ కుమార్ రెడ్డికి అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇప్పించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరికి ధీటుగా జేసీ వర్గం కూడా అర్బన్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోంది.

వైకుంఠం.. బలహీనం
ప్రస్తుతం అనంతపురం టీడీపీలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి బలహీన పడ్డారని ఆ పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని పక్కనపెట్టి దివాకర్ రెడ్డి తనయుడికి టిక్కెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. తనకు కాకుండా ప్రత్యర్థి వర్గానికి ప్రాధాన్యత దక్కడం పై అసంతృప్తి గా ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి సరికొత్త ఎత్తుగడ వేశారు.

హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్-చంద్రబాబుల భేటీని తన పొలిటికల్ కెరీర్‌కు అనుకూలంగా మార్చుకునే ప్లాన్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ జరగగానే.. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి స్పందించారు. పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని.. ఆయన కోసం నా సీటును త్యాగం చేస్తానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇలా చెప్పటం వల్ల పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలన్నది ప్రభాకర్ చౌదరి ఎత్తుగడ. ఎలాగూ అనంతపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయరు కనుక.. టిక్కెట్ తనకే దక్కుతుందని.. జేసీ దివాకర్ రెడ్డిపై పైచేయి సాధించవచ్చన్నది ప్రభాకర్ చౌదరి ఎత్తుగడ అని చెబుతున్నారు.

తనకు కాకుండా జేసీ తనయుడికి అనంతపురం అర్బన్ టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావించినా.. పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో తనకే టిక్కెట్ వచ్చేలా ప్రభాకర్ చౌదరి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీటు కాపాడుకోవడానికి టీడీపీలో ప్రతి ఒక్కరు బాగా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు