‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్‌’!

14 Sep, 2022 19:41 IST|Sakshi

సాక్షి, నల్గొండ: పార్టీకి న‌మ్మక‌స్తుడిగా పేరున్న బూర న‌ర్సయ్య అధినేత కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే నేత‌ల్లో ఒక‌రుగా పేరుంది. అయితే ఇప్పుడు ఆ డాక్టరే పార్టీకి తలనొప్పిగా మారాడన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా ఖాళీగా ఉంటోన్న మాజీ ఎంపీ చూపు ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ సీటు మీద పడిందా? సౌమ్ముడిగా పేరున్న ఈ నేత పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఎందుకు మారాడు?
చదవండి: కేసీఆర్‌ సర్కార్‌ను గవర్నర్‌ ఇరుకున పెట్టారా?

మునుగోడు ఉప ఎన్నిక‌ టీఆర్ఎస్‌కు పెద్ద త‌లనొప్పిగా మారింది. న‌ల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనంత మంది ఆశావాహులు మునుగోడులోనే ఉన్నారు. అంద‌రినీ ఒప్పించి ఏక‌తాటిపైకి తీసుకొచ్చేందుకే పార్టీ నాయకత్వానికి తలబొప్పి కట్టింది. అంతా స‌ర్దుకుంద‌ని అనుకుంటున్న తరుణంలో మాజీ ఎంపీ బూర న‌ర్సయ్య గౌడ్ రూపంలో కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. పార్టీ నిర్ణయాల ప్రకార‌మే న‌డుచుకుంటానంటూనే పార్టీ ఇబ్బందుల్లో ప‌డేలా ఆయ‌న వ్యవ‌హార శైలి ఉందంటున్నారు. మునుగోడులో బీసీ సామాజిక వ‌ర్గానికే మెజార్టీ ఓటు బ్యాంకు ఉంద‌ని.. ఆ వ‌ర్గాల నుంచి తాను టికెట్ అడ‌గడంలో త‌ప్పేంటని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

నెల క్రితం చౌటుప్పల్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మునుగోడులో ఎప్పుడూ రెడ్లు, వెల‌మ‌లే ఎమ్మెల్యేలు కావాలా.. బీసీలకు అవ‌కాశం ఇవ్వరా అంటూ చేసిన కామెంట్స్‌ తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. ఆ త‌ర్వాత సైలెంట్ అయిన‌ట్లు క‌నిపించినా మ‌రోసారి మునుగోడు నియోజకవర్గంలోనే ప్రెస్ మీట్ పెట్టీ మ‌రి త‌న మ‌న‌సులో మాట‌ బ‌య‌ట పెట్టారు. టికెట్ అడ‌గడంతో పాటు ఏకంగా పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ ఘాటైన విమ‌ర్శలు చేయ‌డంతో ఒక్కసారిగా కాక‌రేగింది. ఈ వ్యాఖ్యలు జిల్లా మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డిని ఉద్దేశించే అన్నార‌ని చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. త‌న‌ను పార్టీ కార్యక్రమాల్లో ఇన్‌వాల్వ్ చేయ‌డం లేద‌ని... ఇలా ఎందుకు జ‌రుగుతుందో జిల్లా మంత్రే వివరించాలనడాన్ని బట్టి చూస్తే ఓ ప్రణాళిక ప్రకార‌మే ఆయ‌న పార్టీపై అసంతృఫ్తిని వెళ్లగ‌క్కిన‌ట్లుందని టీఆర్ఎస్‌లోనే చ‌ర్చ సాగుతోంది. 

భువనగిరి ఎంపీగా 2014లో గెలిచిన బూర గత ఎన్నికల్లో ఓటమి చెందారు. మూడేళ్ళుగా ఖాళీగా ఉన్న ఆయన చూపు ఇప్పుడు అసెంబ్లీ మీద పడింది. అందుకే తన సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న సొంత నియోజకవర్గం మునుగోడులో పోటీచేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్లకే ఇస్తున్నార‌న్న వార్తలు బ‌య‌ట‌కు రావ‌డంతో నెల రోజుల క్రితం కూసుకుంట్ల వ్యతిరేకులంతా చౌటుప్పల్‌లో స‌మావేశం అయ్యారు. అయితే ఈ స‌మావేశం వెనుక అస‌లు సూత్రధారి న‌ర్సయ్యేన‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కత్వం బూర‌తో మంత‌నాలు సాగించిన‌ట్లు జోరుగా ప్రచారం సాగింది. పార్టీలోకి వ‌స్తే టికెట్ ఇస్తామ‌నే హామీ కూడా ఇచ్చిన‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఆయ‌న‌తో పాటు క‌ర్నె ప్రభాక‌ర్ తో కూడా కాంగ్రెస్ చ‌ర్చలు జ‌రిపిన‌ట్లు టీఆర్ఎస్ వ‌ర్గాలే మాట్లాడుకున్నాయి.

అయితే కాంగ్రెస్‌లో చేరితే గెలుస్తామో లేదో అనే సందేహంతోనే టీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతున్నారు. మ‌రోవైపు బూర న‌ర్సయ్య చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బూర న‌ర్సయ్య వ్యవ‌హారం మునుగోడు టీఆర్ఎస్‌లో మ‌రింత హీట్‌ను పెంచిన‌ట్లైంది. ఇదే స‌మయంలో పార్టీలో ఉన్న బీసీ నేత‌లు కూడా బూర న‌ర్సయ్య వ్యాఖ్యల‌ను త‌ప్పుబ‌డుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు