జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌కు బీజాలు.. బీజేపీకి సీనియర్‌ నేత రాజీనామా

25 Jan, 2023 17:59 IST|Sakshi

దేశంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఒడిషాలో బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత, ఆయన కుమారుడు షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేస్తూ జేపీ నడ్డాకు లేఖ రాసి కాషాయ పార్టీని వీడారు. అయితే, వారిద్దరూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్.. బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు గిరిధ‌ర్ గ‌మాంగ్ ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో తమకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకనే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. కొందరు మమ్మల్ని ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీల్లో పక్కనపెట్టారు. పార్టీ కార్యక్రమాల గురించి ఆలస్యంగా సమాచారం ఇస్తున్నారు. నాకు ఎంపీ టికెట్‌ ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారని శిశిర్‌ ఆరోపించారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో మాత్రం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించలేదన్నారు. 

ఇదిలా ఉండగా.. గిరిధ‌ర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా ఒడిశా ప్రజలకు తాను తన రాజకీయ, సామాజిక, నైతిక బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో గమాంగ్ పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆయన కోరారు. అయితే, ఈ క్రమంలోనే తాను జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానని.. మళ్లీ ఇప్పుడు కూడా మరో నేషనల్‌ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. కాగా, ఇటీవలే వీరితో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దీంతో, వీరిద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

మరిన్ని వార్తలు