క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా.. సిసోడియాకు బీజేపీ సవాల్‌

18 Oct, 2022 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సవాల్ విసిరారు బీజేపీ నేత కపిల్ మిశ్రా. సీబీఐపై సిసోడియా చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లై డిటెక్టర్, నార్కో పరీక్షకు సిద్ధమని మీడియా ముందుకు వచ్చి అంగీకరించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై సిసోడియా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను సోమవారం 9 గంటలపాటు విచారించారు సీబీఐ అధికారులు. అనంతరం మీడియాతో మాట్లాడిన సిసోడియా.. తనను ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని సీబీఐ అధికారులు బెదిరించారని, లేదంటే ఇలాగే మరిన్ని కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. అంతేకాదు తనకు బీజేపీలో సీఎం పదవి ఆపర్ చేశారని పేర్కొన్నారు. ఈ విచారణ అనంతరం తనపై పెట్టింది తప్పుడు కేసు అని పూర్తిగా అర్థమైందని సిసోడియా అన్నారు. తనను ఏం చేసినా సరే ఆప్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సిసోడియా ఆరోపణలను సీబీఈ ఇప్పటికే ఖండించింది. ఆయన వ్యాఖ్యల్లో అసలు వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. వృత్తిపరంగానే తాము సిసోడియాను విచారించినట్లు స్పష్టం చేసింది. మున్ముందు కూడా చట్టప్రకారమే ఆయన్ను విచారిస్తామంది. తాజాగా బీజేపీ సిసోడియా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరింది.
చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష!

మరిన్ని వార్తలు