బీజేపీకి వత్తాసు : ఫేస్‌బుక్‌ క్లారిటీ

17 Aug, 2020 10:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ బీజేపీతో చేతులు కలిపిందన్న విమర్శలపై ఫేస్‌బుక్ స్పందించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. రాజకీయ లేదా పార్టీ అనుబంధ సంస్థలతో సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్‌ను తాము నిషేధించామనీ,  ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందనీ, తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని  పేర్కొన్నారు.

కాగా భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో పొత్తు పెట్టుకున్న ఫేస్‌బుక్ , బీజేపీ ,దాని అనుబంధ సంస్థ నేతలు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదంటూ  'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన ప్రత్యేక కథనం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇండియాలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ఫేస్‌బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయనడానికి అమెరికా మీడియా కథనం నిదర్శనమని రాహుల్  విమర్శించారు. 

ఈ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్ పౌరుల హక్కులను పరిరక్షించడం, సామాజిక/ఆన్‌లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని నివారించడం అనే అంశంపై సాక్ష్యాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై గతంలో ఫేస్‌బుక్ కు నోటీసులిచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ ఆ రోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయినవారు  ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్‌బుక్ ఒప్పందంతో రెడ్ హ్యాండెడ్ గా దోరికిపోయింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఎదురు దాడి చేసిన  సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు