ఎమ్మెల్యే రాచమల్లుపై దుష్ప్రచారం

7 Aug, 2020 10:40 IST|Sakshi

టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్‌ 

ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిపై ఉద్దేశ పూర్వకంగానే కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఓ మీడియాలో కథనం ప్రసారం చేశారని టీటీడీ పాలకమండలి సభ్యుడు చిప్పగిరి ప్రసాద్‌ అన్నారు. స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో  మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లుకు  సత్సంబంధాలు లేవని చెప్పడం వాస్తవం కాదన్నారు. సీఎంతో ఉన్న సన్నిహిత సంబంధంతోనే ఎమ్మెల్యే తనలాంటి సాధారణ వ్యక్తికి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పదవి ఇప్పించారన్నారు. సీఎంతో చర్చించిన తర్వాతే ప్రొద్దుటూరులో టిడ్‌కో ఇళ్లను రద్దు చేసి, ప్రస్తుతం లబ్ధిదారులకు స్థలాలు ఇస్తున్నారన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పడంలో అర్థం లేదన్నారు. తనలాంటి కార్యకర్తకు చాలా కాలం తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణాధ్యక్ష పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి చెందిన శేఖర్‌ యాదవ్‌కు ఎంపీపీ పదవికి ప్రతిపాదన చేశారని, నంగనూరుపల్లెకు చెందిన యాలం తులశమ్మకు మార్కెట్‌ చైర్‌పర్సన్, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డికి వైస్‌ చైర్మన్, ఎస్‌ఏ నారాయణరెడ్డికి రాజుపాళెం మండల బాధ్యునిగా పదవులు ఇచ్చారన్నారు.  

వరదరాజులరెడ్డి వస్తారనేది అవాస్తవం 
1996 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్న బంగారురెడ్డి చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తొలి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం ఆయన కార్యకర్తలా శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారన్నారు. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నారని ప్రచారం చేయడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎంపీపీ అభ్యర్థి శేఖర్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు పనితీరును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సైతం ప్రశంసించారన్నారు. మార్కెట్‌యార్డు వైస్‌ చైర్మన్‌ కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, రాజుపాళెం మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ చైర్మన్‌ ద్వార్శల భాస్కర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ వరికూటి ఓబుళరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు శంకర్‌యాదవ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు