మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయం

5 Oct, 2021 06:22 IST|Sakshi

ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ, యూపీలో యోగి, హరియాణాలో ఖట్టర్, అస్సాంలో హేమంత్‌ బిశ్వ శర్మల ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మికుల యూనియన్‌ (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆరోపించారు. మోదీ, యోగి ప్రభుత్వాల పతనం ఖాయమని, త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. లఖీమ్‌పూర్‌ ఘటనను నిరసిస్తూ సోమవారం ఢిల్లీలోని యూపీ భవన్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

చదవండి: (లఖీమ్‌పూర్‌ ఖేరిపై.. రాజకీయ ప్రకంపనలు) 

హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రైతులను కొట్టండి... నేనున్నాను, చూసుకుంటానని కార్యకర్తలను ఉసిగొల్పిన తరువాత కూడా ఆయనను ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగించగలుగుతున్నారని వెంకట్‌ ప్రశ్నించారు. మోడీ, అమిత్‌ షా మద్దతు లేకుండా ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడుతారా? అని వ్యాఖ్యానించారు. 11 నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని హత్యల ద్వారా అణచివేయాలని కుట్రలు పన్నుతున్నారని వెంకట్‌ ధ్వజమెత్తారు. అయితే ఇది వారికి ఏమాత్రం సాధ్యం కాదని, యూపీ ప్రభుత్వం వేసిన విచారణ కమిటీపై తమకు నమ్మకం లేదని తెలిపారు. యూపీలో రాజ్యాంగం అమలవ్వటం లేదని, అధికారులు, ప్రభుత్వం ప్రజల పక్షాన పని చేయని కారణంగా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో స్వతంత్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
రైతు ఉద్యమానికి ముప్పాళ్ల సంఘీభావం 

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు,  తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూననేని సాంబశివరావు , బీకేఎంయూ జాతీయ కార్యదర్శి జెల్లి విల్సన్‌లు సంఘీభావం తెలిపారు. 

మరిన్ని వార్తలు