వెంకయ్య నాయుడికి తృణమూల్‌ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న

8 Aug, 2022 20:33 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభ వీడ‍్కోలు పలికింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వెంకయ్యకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ డెరెక్‌ ​​ఓబ్రెయిన్‌ పలు ప్రశ్నలు సంధించారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కు తీసుకున్న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 2020, సెప్టెంబరు 20న ఎగువ సభ ఆమోదించినప్పుడు రాజ్యసభ చైర్మన్‌ స్థానంలో వెంకయ్య లేరని డెరెక్‌ ​​ఓబ్రెయిన్‌ గుర్తు చేశారు.  ‘బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఆత్మకథలో దీనికి సమాధానం ఇస్తార’ని ఆయన చమత్కరించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సెప్టెంబర్ 2013న పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై వెంకయ్య నాయుడు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గురించి కూడా ప్రస్తావించి.. దీనికి కూడా ఆత్మకథలోనే సమాధానం చెబుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. 


ఫోన్ ట్యాపింగ్‌ వివాదంపై 2013లో ఎగువ సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తాను రాజ్యసభ చైర్మన్‌ ఉన్న సమయంలో మాత్రం పెగాసస్‌పై చర్చకు అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘మార్చి 1, 2013న, మీరు సభలో 5-6 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్‌పై జోక్యం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా పెగాసస్‌ అంశాన్ని సభలో చర్చించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేద’ని అన్నారు. 

కాగా, వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియడంతో నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 6న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాపై ధన్‌కర్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. (క్లిక్: ఇది ఉద్వేగభరితమైన క్షణం.. ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు