కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తి

19 Sep, 2020 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: కేంద్రం తెస్తున్న నూతన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రం విధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌ను ఆయన శనివారం ఆదేశించారు. బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలని చెప్పారు. నూత‌న వ్య‌వ‌సాయ బిల్లు తేనేపూసిన క‌త్తి లాంటిదని కేసీఆర్‌‌ వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం చేకూర్చి, కార్పొరేట్‌ శక్తులు లాభపడేలా బిల్లు ఉందని విమర్శించారు. వ్యవసాయ బిల్లును ముమ్మాటికీ వ్యతిరేకించి తీరుతామని  స్ప‌ష్టం చేశారు.
(చదవండి: రసవత్తరంగా రాజ్యసభ.. బిల్లు గట్టెక్కేదెలా!)

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పైకి మాత్రం రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులకే మేలు చేసేలా ఉంది. వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం ఇది. కార్పోరేట్ మార్కెట్‌ శక్తులు దేశమంతా విస్తరించడానికి, వారికి దారులు బార్లా తెరవడానికి ఉపయోగపడే బిల్లుగా ఉంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. తమకున్న కొద్దిపాటు సరుకును రైతులు ఎన్నో రవాణా ఖర్చులు భరించి, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మడం సాధ్యమవుతుందా?

మొక్కజొన్నల దిగుమతిపై ప్రస్తుతం 50 శాతం సుంకం అమల్లో ఉంది. కేంద్రం దీనిని  15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 70 నుంచి 75 లక్షల టన్నుల మొక్క జొన్నలను కేంద్రం ఇప్పటికే కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గియడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది. ఎవరి ప్రయోజనం ఆశించి ఈ పని చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలో మొక్కజొన్నలు బాగా పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి’అని సీఎం కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

కాగా, నూతన వ్యవసాయ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. బిల్లుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్‌, డీఎంకే పార్టీల ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఇక బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్‌ కూడా నూతన వ్యవసాయ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించింది. నిరసనగా పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
(చదవండి: మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్లు 2016 నాటివి: భట్టి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా