కొత్త సాగు చట్టాలు వద్దు

29 Sep, 2020 03:32 IST|Sakshi
ఢిల్లీలో ఇండియాగేట్‌ వద్ద ట్రాక్టర్‌కు నిప్పుపెట్టి రైతుల నిరసన

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతులు, ప్రతిపక్షాల నిరసనలు

న్యూఢిల్లీ/ఖట్కార్‌కలాన్‌: కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లులతో రైతాంగానికి తీవ్ర నష్టం తప్పదని పేర్కొంటూ ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా కాంగ్రెస్‌ సహా వివిధ ప్రతిపక్ష పార్టీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్నాయి. సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద నిరసనకారులు ఓ ట్రాక్టర్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్న పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, తెలంగాణ, గుజరాత్, గోవా, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి, నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బిల్లులను సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ చెప్పారు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన కోరారు. తమిళనాడులో జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఎండీఎంకే చీఫ్‌ వైగో, పీసీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, డీఎంకే నేతలు టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో రైతు సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.  

ప్రజాస్వామ్యం మరణించింది: రాహుల్‌  
ఎన్డీయే ప్రభుత్వం రైతన్నల గొంతులను పార్లమెంట్‌ లోపల, బయట కర్కశంగా అణచి వేసిందని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం మరణించింది అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులు రైతుల పాలిట మరణ శాసనమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ తేల్చిచెప్పారు.

ధాన్య సేకరణ ప్రారంభమైంది
కనీస మద్ధతు ధరతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు దేశమంతా ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. 48 గంటల్లో హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లోని 390 మంది రైతుల నుంచి రూ. 10.53 కోట్ల విలువైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని సోమవారం ప్రకటించింది.  2020–21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో 495.37 లక్షల టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు