దేశాన్ని నలుగురు నడిపిస్తున్నారు: రాహుల్‌

12 Feb, 2021 03:58 IST|Sakshi

కొత్త సాగు చట్టాలపై రాహుల్‌ విమర్శ

దేశాన్ని నలుగురే నడిపిస్తున్నారు; వారెవరో అందరికీ తెలుసు

లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో రైతు సంక్షోభంపై ప్రసంగం

న్యూఢిల్లీ:  వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై దాడిని కాంగ్రెస్‌ తీవ్రం చేసింది. ఈ చట్టాలతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, ఇవి రైతుల వెన్నెముకను విరిచేస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారని, వారెవరో అందరికీ తెలుసని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో గురువారం బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. తన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను విమర్శించేందుకే ప్రాధాన్యతనిచ్చారు.

‘విపక్ష సభ్యులెవరూ వ్యవసాయ చట్టాల్లోని విషయాలపై, వాటి ఉద్దేశాలపై మాట్లాడలేదని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ఆ చట్టాల ఉద్దేశాలపై, అందులోని విషయాలపై నేను మాట్లాడుతాను. ఈ చట్టాల సాయంతో కార్పొరేట్లు భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి, ఇష్టమొచ్చినంత కాలం నిల్వ చేసి, దేశ ఆహార భద్రతను నాశనం చేస్తారు. అదే ఆ చట్టాల ప్రధాన ఉద్దేశం’అని రాహుల్‌ విమర్శించారు.

కుటుంబ నియంత్రణ ప్రచార నినాదమైన ‘మనం ఇద్దరం.. మనకు ఇద్దరు’స్ఫూర్తితో ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులు మాత్రమే నడిపిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు కనుమరుగవుతాయని, నిత్యావసర వస్తువుల చట్టం ప్రాధాన్యత కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆహార భద్రత వ్యవస్థను, గ్రామీణ ఆర్థిక రంగాన్ని కొత్త సాగు చట్టాలు నాశనం చేస్తాయి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు విశ్రమించబోరు’అన్నారు. ‘నిజమే.. ఈ చట్టాలు రైతులకు ఎంచుకునే అవకాశం ఇచ్చాయి. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలను ఎంచుకునే అవకాశం’అని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మాత్రమే ఉద్యమించడం లేదని, దేశమంతా వారి వెనుక ఉందని, ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు.

ఉద్యమంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. రైతుల మృతికి నివాళిగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సభ్యులతో కలిసి సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘సాగు చట్టాలపై ప్రత్యేక చర్చ కావాలని కోరాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే, నిరసనగా, నేను ఈ రోజు రైతుల విషయంపైనే మాట్లాడుతాను’అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయం కూడా బడ్జెట్‌లో భాగమేనని, అదీకాక, బడ్జెట్‌పై చర్చల్లో పాల్గొన్న సభ్యుడు సాధారణ అంశాలపై కూడా మాట్లాడవచ్చని నిబంధనల్లోనే ఉందని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు