ఎన్నికల వేడి.. కరువు దాడి

3 Apr, 2024 05:00 IST|Sakshi

లోక్‌సభ సమరానికి ముందు రైతాంగ సమస్యలే ఎజెండా

ముదురుతున్న రాజకీయ యుద్ధం 

ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటున్న ప్రధాన ప్రతిపక్షం 

వినతిపత్రాలు, దీక్షలతో వేడి రాజేస్తున్న వైనం 

మేం చలికాలంలో అధికారంలోకి వచ్చామంటూ అధికార పక్షం వివరణ 

మీ కాలంలోనే కరువు వచ్చిందంటూ ఎదురుదాడి 

మేము సైతం అంటూ బీజేపీ కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌ జలాల విడుదలపై రాజుకున్న వివాదానికి మంగళవారం తెరపడింది. కొన్ని రోజులుగా కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు  నిలిపివేయడంతో ఆ వాగు ఆయకట్టు ప్రాంతంలోని వరి పొలాలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే తామే మల్లన్నసాగర్‌ గేట్లను తెరుస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో యంత్రాంగం చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మల్లన్నసాగర్‌ గేట్లను ఎత్తి కొండపోచమ్మ సాగర్‌ కాల్వలోకి నీటిని వదిలారు. సాయంత్రం గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్‌ కాల్వ నుంచి కూడవెల్లిలోకి గోదావరి జలాలను వదిలారు.      – గజ్వేల్‌  

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి. కరువు పేరిట రాజకీయ యుద్ధానికి తెరలేపుతున్నాయి. రైతు సంబంధిత అంశాలను అ్రస్తాలుగా మార్చుకుంటున్నా యి. విపక్షాలు, అధికార పక్షం ఒకదానిపై మరొకటి మాటల దాడులు చేసుకుంటున్నాయి. రైతు సంక్షేమానికి పాటు పడేది తామేనంటూ ఏకరువు పెడుతున్నాయి. ఎండిన పంటల పరిశీలన కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో చేసిన పర్యటనతో కరువు రాజకీయం ముదురు పాకాన పడింది.  

కాంగ్రెస్‌ తెచ్చిన కరువన్న కేసీఆర్‌ 
జిల్లాల పర్యటనలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువని ధ్వజమెత్తారు. అంతేకాకుండా రైతుల పక్షాన కార్యాచరణలో భాగంగా మంగళవారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టింది.

రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ పార్టీ నేతలు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈనెల 5వ తేదీన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనలకు సైతం కేసీఆర్‌ సిద్ధమవుతుండగా, 6వ తేదీన వరి పంటకు బోనస్‌ డిమాండ్‌ చేస్తూ దీక్షలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు రిజర్వాయర్ల నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.  

భరోసా పేరిట బీజేపీ 
బీజేపీ కూడా రైతుల పక్షాన ఆందోళనలకు దిగింది. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసమంటూ  కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ మంగళవారం కరీంనగర్‌ వేదికగా రైతుదీక్ష చేపట్టారు. ఇదే క్రమంలో ఈనెల ఐదో తేదీన రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగుతూ విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతోంది. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌, ఇతర మంత్రులు ధీటుగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.   

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers