సీఎం కేసీఆర్‌ రైతుల వ్యతిరేకి: వైఎస్ షర్మిల

12 Jun, 2021 02:36 IST|Sakshi
పాలేపల్లిలో వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న వైఎస్‌ షర్మిల

పాలేపల్లి పర్యటనలో వై.ఎస్‌. షర్మిల మండిపాటు

దోమ: కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనందుకు నిరసనగా 3 రోజుల క్రితం వికారాబాద్‌ జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించిన విషయం తెలుసుకున్న షర్మిల... అన్నదాతల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శుక్రవారం పాలేపల్లిలో పర్యటించారు.

ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నా సీఎం కేసీఆర్‌ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరి గింజ వరకూ కొంటామని చెప్పి జూన్‌ వరకూ ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, రాజగోపాల్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు