అన్నాడీఎంకే: రెండాకుల్లో.. మూడుముక్కలాట!

6 Jul, 2022 13:33 IST|Sakshi

అన్నాడీఎంకే పగ్గాల కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్‌ పోరు

నేడు పన్నీర్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ

11న సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రబలశక్తి. రెండాకుల గుర్తుపై గణనీయమైన ఓటు బ్యాంకు ఈ పార్టీకి సొంతం. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి క్రమశిక్షణ కనుమరుగైపోగా, రెండాకుల పార్టీ కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్‌ మధ్య మూడుముక్కలాట తరహా రాజకీయాలు నడుస్తున్నాయి.  వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్, ఆ తరువాత  పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రధాన కార్యదర్శిగా పార్టీని పరుగులు పెట్టించారు.

జయ మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం వీకే శశికళ (వీకేఎస్‌), ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్‌) పోటీపడ్డారు. ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్,ఈపీఎస్‌ల జంట నాయకత్వం అనివార్యమైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం, పార్టీ ఓటమి తరువాత అంతః కలహాలు మొదలయ్యాయి. ఏక నాయకత్వం నినాదంతో గద్దెనెక్కాలని ఎడపాడి చేస్తున్న ముమ్మురమైన ప్రయత్నాలపై ఓపీఎస్‌ న్యాయపోరాటానికి దిగారు. పోటీగా ఈపీఎస్‌ సైతం కోర్టు మెట్లెక్కారు.  

ముచ్చటగా మూడో నేత..     
ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడం ద్వారా పార్టీని కైవసం చేసుకుకోవాలని ఎడపాడి పళనిస్వామి భావిస్తుండగా ఆ ప్రయత్నాలకు పన్నీర్‌సెల్వం గండికొడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్‌ కుమ్ములాటతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఈసీ (ఎన్నికల కమిషన్‌) నిషేధం విధించింది. ఇక అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ కలవరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులనే నిజమైన నేతలుగా పరిగణించాలి, కార్యకర్తలను కలుపుకుపోగల ఏక నాయకత్వమే పార్టీకి శ్రేయస్కరమని ఈనెల 4వ తేదీన పూందమల్లి జరిపిన పర్యటనలో శశికళ అన్నారు. క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించేందుకు పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుతున్నారని ఆమె చెప్పారు.
చదవండి: Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్క‌మ్ చెప్పిన భార్య  

స్టే కోసం ఓపీఎస్‌ పిటిషన్‌ 
ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఈనెల 11వ తేదీన తలపెట్టిన సర్వసభ్య సమావేశం నిర్వహణపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఓపీఎస్‌ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈమేరకు స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టే కోసం ఒకవైపు ఓపీఎస్‌ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఈపీఎస్‌ సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీన సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా తనను కార్యకర్తలే ఎన్నుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నుతున్నారు.

ఈ సమావేశానికి పోలీసు బందోబస్తు కల్పించాలని మాజీ మంత్రి జయకుమార్‌ డీజీపీకి మంగళవారం దరఖాస్తు చేశారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. జనరల్‌బాడీ సమావేశానికి హాజరయ్యే సభ్యులకు బార్‌కోడ్‌తో కూడిన గుర్తింపుకార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక, పన్నీర్‌సెల్వం వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేలా ఎడపాడి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పనిలో పనిగా పన్నీర్‌సెల్వంకు సైతం ఎడపాడి ఆహ్వానం    పంపడం విశేషం.   

మరిన్ని వార్తలు