-

నితీశ్‌కు ఊహించని షాక్.. బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు..

3 Sep, 2022 11:37 IST|Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌లో మొత్తం ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బీజేపీలో విలీనమయ్యారు. స్పీకర్‌ ఆమోదంతో శుక్రవారం అధికారికంగా ఈ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న వారాల వ్యవధిలోనే ఈ పరిణామం జరగడం బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు షాకే అని చెప్పాలి. ఎమ్మెల్యేల చేరిక అనంతరం బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ.. నితీశ్‍పై విమర్శలు గుప్పించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లు  జేడీయూ ముక్త్ రాష్ట్రాలుగా అవతరించాయని పేర్కొన్నారు. బిహార్‌ రాజధాని పాట్నాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడం గమనార్హం. 

నితీశ్ కుమార్‌కు బీజేపీకి షాక్ ఇవ్వడం తొమ్మిదో రోజుల్లో ఇది రెండోసారి. ఆగస్టు 25న అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏకైక జేడీయూ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడి కమలం గూటికి వెళ్లారు. జేపీ నడ్డా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రాష్ట్రాల్లో జేడీయూకు ఉనికి కోల్పేయే పరిస్థితి రావడం నిజంగా నితీశ్‌కు దెబ్బెే అని విశ్లేషకులు అంటున్నారు.

2019 ఎన్నికల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో జేడీయూ 7 స్థానాల్లో గెలిచింది. అయితే ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లారు. మిగిలిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆగస్టు 25న బీజేపీ గూటికి చేరారు. దీంతో రాష్ట్రంలో జేడీయూ ఖాళీ అయింది.
చదవండి: ఆప్‌కు అధికారమిస్తే.. గుజరాతీలకు బంపరాఫర్‌

మరిన్ని వార్తలు