Assembly Elections Exit Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

7 Mar, 2022 21:26 IST|Sakshi

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది దేశమంతటా ఆసక్తిగా మారింది. ఇక దేశంలోనే అత్యధిక సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం మరోసారి వికసించనున్నట్లు ఎగ్జిట్‌పోల్‌ ఫలితాల్లో వెల్లడైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను పరిశీలిస్తే..

యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా..?
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్‌ పోల్‌ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది.

ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కుతుందా?
హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్‌ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్‌  కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్‌ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే!

పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి రానుందా?
పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధికారంలోకి రానుందా? అంటే అవుననే అంటోంది పీపుల్స్‌ పల్స్‌ సర్వే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్‌ పల్స్‌ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు పోస్ట్‌ పోల్‌ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్‌ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్‌ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.

మణిపూర్‌లో గెలుపెవరిది?
మణిపూర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్‌ నేతృత్వంలోని  బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో పీపుల్స్‌ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్‌ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. 

అదే విధంగా ఎన్‌పీపీ 7 నుంచి 11, ఎన్‌పీఎఫ్‌ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్‌ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చని వెల్లడించింది.

గోవాలో మిగతా రాష్ట్రాల్లో కంటే భిన్నంగా..
గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్‌ ఫోల్‌ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్  ఫలితాలు చెబుతున్నాయి గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్‌ తప్పనిసరైతే.. కింగ్‌ మేకర్‌గా ఎవరు మారనున్నారో మార్చి 10న తేలనుంది.

మరిన్ని వార్తలు