Ghulam Nabi Azad: పార్టీ కోసం మా జీవితాలు ధారపోశాం.. ఇప్పుడిలా చూస్తాం అనుకోలేదు

11 Mar, 2022 14:13 IST|Sakshi

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి శరాఘాతం అయ్యింది. పంజాబ్‌లో అధికారం కోల్పోయి.. యూపీలో అవమానకరమైన ఫలితాల్ని చవిచూసింది గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీకి సంస్కరణలు ‘ఇప్పటికైనా అవసరమ’నే  విషయాన్ని ఇటు సీనియర్లు, అటు జూనియర్లు గుర్తు చేస్తున్నారు. 

‘‘ఫలితాలతో దిగ్భ్రాంతికి లోనయ్యా.  ఒక్కో రాష్ట్రంలో మా ఓటమిని చూసి నా గుండె రక్తమోడుతోంది. పార్టీ ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా’’ అని CWC సభ్యుడు గులాం నబీ ఆజాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్‌ కోసం మా యవ్వనాన్ని, జీవితాన్ని ధారపోశాం. పార్టీలోని బలహీనతలను గురించి నేను మరియు నా సహచరులు చాలా కాలంగా మాట్లాడుతున్నాం.  ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గమనించి.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా’’ అని గులాం నబీ ఆజాద్‌ తెలిపారు. మరో సీనియర్‌ నేత శశిథరూర్‌ కూడా ‘మార్పు అనివార్యం..సంస్కరణ అవసరం’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘‘అంతా తప్పు జరిగింది. కాంగ్రెస్‌లో సీరియస్‌గా పోటీ చేయాలనే ఉద్దేశ్యం లేదు...నరేంద్ర మోదీ, అమిత్ షా లాగా పూర్తి బలంతో పోరాడి ఉండాల్సింది. పంజాబ్‌లో నాయకత్వాన్ని మార్చుకోవడంతో సంస్థలో గందరగోళం నెలకొంది. మా ఇన్నింగ్స్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే కాంగ్రెస్‌లో యువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌(75).

జీ-23 భేటీ
2014 నుంచి ఇప్పటిదాకా 45 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెల్చింది కేవలం ఐదు మాత్రమే.  ప్రస్తుతం రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే అధికారంలో ఉంది. నాయకత్వ.. వ్యవస్థీకృత లోపాలు, కొత్తవారికి అవకాశం ఇవ్వకపోవడం, కష్టపడి పనిచేసేవారిని పక్కనబెట్టడం లాంటివి కాంగ్రెస్‌లో లుకలుకలకు కారణం అవుతున్నాయి.  దీన్ని గమనించిన 23 మంది పార్టీ సీనియర్‌ నేతలు అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఆ హెచ్చరికలను మరోలా అర్థం చేసుకుని.. జీ-23గా పేరుపెట్టి సీనియర్లను వేరుగా చూడటం ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి నేపథ్యంలో..  ఈ జీ-23లోని కొందరు సభ్యులు.. గులాంనబీ ఆజాద్‌ ఇంట్లో శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 

ఏమని ప్రచారం చేయాలి?
యూపీ ఎన్నికల్లో భాగంగా.. ఒక్క ప్రియాంక గాంధీనే ఆ రాష్ట్రంలో 209 ర్యాలీల్లో పాల్గొంది. లఖింపురీ రైతుల హత్య గురించి హత్రాస్‌కు వెళ్లి మరీ రాహుల్‌తో గళం వినిపించారామె. కానీ, ఏదీ పని చేయలేదు. ఈ నేపథ్యంలో యువ వర్గం.. సమర్థవంతమైన  మార్పు కావాలనుకుంటోంది. ‘హిందూ-ముస్లిం కార్డుతో బీజేపీ గెలుస్తోందని పదే పదే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రచారానికి ఆస్కారం ఎక్కడ ఉంది? పంజాబ్‌లో ముస్లిం ఓటర్ల శాతం ఎంత? సామర్థ్యం లేని నాయకత్వం వల్లే ఇలాంటి ఫలితాల్ని చూడాల్సి వస్తోంది. అది పార్టీ అధినాయకత్వం కూడా అంగీకరించాల్సిందే.  నానాటికీ సంక్షోభంలోకి జారుకొంటున్న పార్టీని కాపాడుకోవాలంటే.. పాత రక్తాన్ని తప్పించి.. తమకు అవకాశం ఇవవ్వాలని కోరుకుంటోంది యువరక్తం. ఒకవైపు సీనియర్ల సలహాలు.. సీనియర్ల గోల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ వర్కింగ్‌ కమిటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు