మహిళా శక్తి: నిర‍్మలా సీతారామన్‌ ట్వీట్‌ వైరల్‌

8 Jul, 2021 12:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జంబో కేబినెట్‌ విస్తరణలో మహిళా మంత్రుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మహిళా సహచరులతో దిగిన ఒక ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ ఫోటోవైరల్‌గా మారింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సహా మొత్తం తొమ్మిది మందితో కలిసి దిగిన ఫోటోను ఆమె ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు.

కొత్త కేబినెట్‌లో మహిళలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త మహిళా మంత్రులకు అభినందనలు తెలుపుతూ బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా సహా పలువురు మహిళా దిగ్గజాలు, ఇతర ప్రముఖులు కూడా ఈ ఫోటోను షేర్‌ చేయడం విశేషం. 

దర్శన విక్రమ్ జర్దోష్ (60): గుజరాత్ లోని సూరత్ నుండి లోక్‌సభకు ఎంపికయ్యారు.  బీజేపీ తరపున ఆమె మూడో సారి ఎంపీగా ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా  రాజకీయాల్లో ఉన్నా ఈమె వృత్తిరీత్యా వ్యాపారవేత్త . ప్రస్తుతం వస్త్రాలు, రైల్వే సహాయమంత్రి.

ప్రతిమా భౌమిక్‌ (52): అగర్తలాకు చెందిన ప్రతిమా భౌమిక్‌ త్రిపుర వెస్ట్‌ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖా  సహాయ మంత్రి

శోభ కరాంద్లాజే (54): దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన శోభ వరసగా రెండోసారి ఎంపీగా ఉన్నారు. కర్ణాటకలో ఆహార, ప్రజా పంపిణీ, విద్యుత్తు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖల మంత్రిగా పనిచేశారు.  ప్రస్తుతం వ్యవసాయం  మరియు  రైతు సంక్షేమ మంత్రి.

భారతి ప్రవీణ్‌ పవార్‌ (42): మహారాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన  డా. భారతి దిండోరి నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి

మీనాక్షి లేఖి (54): సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర‍్త లేఖి ఎన్‌డీఎంసీ సభ్యురాలు కూడా న్యూఢిల్లీ నుంచి వరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, సంస్కృతి మంత్రి

అనుప్రియ సింగ్‌ పటేల్‌ (40): ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్‌(సోనేలాల్‌) పార్టీ అధ్యక్షురాలు.మీర్జాపూర్‌ నుంచి వరసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో ఆరోగ్య శాఖసహాయమంత్రిగా పనిచేశారు. వాణిజ్యం & పరిశ్రమల మంత్రిగా నియమితులయ్యారు.

అన్నపూర్ణదేవి (51): జార్ఖండ్‌లోని నార్త్‌ఛోతంగపూర్‌కు చెందిన అన్నపూర్ణ దేవి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  జార్ఖండ్‌ మంత్రిగా పనిచేశారు. తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్‌లో  చోటు దక్కించుకున్నారు. విద్యాశాఖ సహాయ మంత్రిగా ఎంపికయ్యారు.

కాగా రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ప్రధాని మోదీ తన తొలి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాష్‌ జవడేకర్‌ లాంటి కీలక మంత్రులకు అనూహ్యంగా ఉద్వాసన పలకడం చర్చకు దారి తీసింది. ఒక దశలో ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌కు ఉద్వాసన తప్పదనే వాదన కూడా వినిపించింది. కొత్త మంత్రులంతా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.నేడు (గురువారం) దాదాపు అందరూ బాధ్యతలను  స్వీకరించిన  సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు