అప్పుడే పుట్టిన బిడ్డపైనా తెలంగాణలో అప్పు.. కేసీఆర్‌కు నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌

1 Sep, 2022 18:55 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. మునుపెన్నడూ లేని విధంగా మోదీ సర్కార్‌లో రూపాయి దారుణంగా పతనమైందని, అప్పులు.. ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ క్రమంలో.. సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కౌంటర్‌ ఇచ్చారు. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆమె ఎద్దేవా చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

‘‘తెలంగాణను కేసీఆర్‌​ అప్పుల్లోకి నెట్టేశారు. ఆ రాష్ట్రంలో ప్రతీ శిశువుపై రూ. 1.25 లక్షల అప్పు ఉంది.  తెలంగాణలో అప్పుడే పుట్టిన బిడ్డ కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి మించి తెలంగాణ అప్పులు చేసింది. కేంద్రం నిధులిచ్చినా కేసీఆర్‌ బద్నాం చేస్తున్నారు. ప్రజలను భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు.
 
పైగా నేనే ప్రధాని అంటూ కేసీఆర్‌ దేశమంతా తిరుగుతున్నారు. ఉపాధీ హామీ పథకం కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చింది. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు. మేం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతీ ఒక్కటి అమల్లోకి రావాలి. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది అంటూ ఆమె కేసీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి సీతారామన్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఇదీ చదవండి: రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా?

మరిన్ని వార్తలు