యూపీలో కమలదళం రోడ్‌ మ్యాప్‌

16 Nov, 2021 04:55 IST|Sakshi

వచ్చే 45 రోజుల్లో  200 ఎన్నికల ర్యాలీలు

పాల్గొననున్న 30 మంది కేంద్ర మంత్రులు 

నేడు పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించనున్న ప్రధాని

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కమలదళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార వ్యూహంపై ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌తో సహా పలువురు బీజేపీ నేతలు కసరత్తు చేసి రోడ్‌మ్యాప్‌ రెడీ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌పైనే పార్టీ పెద్దలు ఫోకస్‌ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అందులో భాగంగానే వచ్చే నెలన్నరలోపు ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో 200కి పైగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటి బాధ్యతలను 30మందికి పైగా కేంద్రమంత్రులకు అప్పగించారు. తొలిదశలో భాగంగా వచ్చే 30 రోజుల్లో 18 మంది కేంద్రమంత్రులు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో ర్యాలీలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి.  వీటితోపాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కీలక నేతల ఎన్నికల ర్యాలీలు ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగనున్నాయి.

రానున్న 45 రోజుల పాటు ప్రతిరోజూ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరో ఒకరు ఉత్తరప్రదేశ్‌లో ర్యాలీ, కార్యక్రమం ద్వారా ప్రజలతో సన్నిహితంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రచార వ్యూహంతో సంబంధం ఉన్న పార్టీ నేత ఒకరు తెలిపారు. అంతేగాక రాబోయే 30 రోజుల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు సంబంధించి యూపీలో అత్యధిక పర్యటనలు ఉండనున్నాయి. వచ్చే రెండు నెలల పర్యటన షెడ్యూల్‌ సైతం ఖరారు చేసే పనిలో కమలదళం బిజీగా ఉంది.  నేటి నుంచి ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లోని పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

నేడు సుల్తాన్‌పూర్‌ జిల్లాలో పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను మోదీ ప్రారంభించనున్నారు. 19న ప్రధాని బుందేల్‌ఖండ్‌ వెళ్ళే అవకాశం ఉందని తెలిసింది. నవంబర్‌ 20న లక్నోలో జరుగనున్న దేశవ్యాప్త డీజీపీ, ఐజీ స్థాయి పోలీసు అధికారుల కార్యాక్రమంలో ప్రధాని, హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఇందులో బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, కాశీ విశ్వనాథ్‌ కారిడార్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, ఫెర్టిలైజర్‌ ఫ్యాక్టరీ సహా పలు భారీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని సమాచారం.   

మరిన్ని వార్తలు