రాహుల్‌ గాంధీకి కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు పాటించకుంటే జోడో యాత్ర నిలిపి వేయాలని ఆదేశం

21 Dec, 2022 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్‌లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కీలక వ్యాఖ్యలు. ఈ యాత్రలో పాల్గొనే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. అందరూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని స్పష్టం చేశారు.

కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే భారత్ జోడో యాత్రలో అనుమతించాలని కేంద్రమంత్రి హితవు పలికారు. ఒకవేళ కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కాకపోతే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జోడో యాత్రను రాహుల్ తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈమేరకు రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు మాండవీయ లేఖ రాశారు.

రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమై ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం రాజస్థాన్ నుంచి హర్యానాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర సాగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల మీదుగా పాదయాత్ర చేసిన రాహుల్.. ప్రస్తుతం హర్యానాలో ఉన్నారు.
చదవండి: రూ.500కే వంటగ్యాస్‌.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు..

మరిన్ని వార్తలు