అమిత్‌తో అమరీందర్‌ భేటీ

30 Sep, 2021 07:24 IST|Sakshi

45 నిమిషాలపాటు చర్చలు

మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని వినతి

త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం!  

న్యూఢిల్లీ: పంజాబ్‌ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. పంజాబ్‌లో మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంతో విభేదిస్తున్న అమరీందర్‌ సింగ్‌ తన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఆయన భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్‌ షాను కలవడం ఆసక్తికరంగా మారింది.

పంజాబ్‌లో రైతుల సమస్యలు, అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రితో అమరీందర్‌ సింగ్‌ చర్చించినట్లు ఆయన మీడియా సలహాదారు రవీన్‌ థుక్రాల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, వాటికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపైనా ఇరువురి నడుమ చర్చ జరిగినట్లు చెప్పారు. మూడు చట్టాలను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలని అమరీందర్‌ కోరినట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో అమరీందర్‌ అతి త్వరలో మరోసారి సమావేశమవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.
 

చదవండి: Punjab Congress Crisis: పార్టీనే సుప్రీం.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందాం: చన్నీ

మరిన్ని వార్తలు