జయలలితకు నెచ్చెలి నివాళి

17 Oct, 2021 04:54 IST|Sakshi
జయ సమాధి వద్ద శశికళ కన్నీరు

అన్నాడీఎంకే శ్రేణుల్లో హైటెన్షన్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆమె నెచ్చెలి శశికళ శశివారం నివాళులర్పించారు. ఇది సర్వసాధారణ విషయమైనా.. పార్టీని కైవసం చేసుకోబోతున్నట్లు శశికళ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడులో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష  అనుభవించి ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించి ఇంటికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చెందడంతో రాజకీయాలపై మరలా దృష్టి సారించడం ప్రారంభించారు. ఈనెల 17న అన్నాడీఎంకే శ్రేణులంతా స్వర్ణోత్సవాలకు సిద్ధమైన తరుణంలో శనివారం ఉదయం 10.30 గంటలకు  అమ్మ సమాధి వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. పదినిమిషాలు మౌనం పాటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా మోస్తున్న గుండెలోని భారాన్ని ఈరోజు దించుకున్నానని మీడియా వద్ద వ్యాఖ్యానించి ఇంటికి వెళ్లిపోయారు.

అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హై టెన్షన్‌
అమ్మ సమాధి వద్ద శశికళ నివాళులర్పించిన తరువాత నేరుగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వస్తారనే సమాచారంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీంతో ఉదయం 10 గంటలకే పార్టీ నేతలు ప్రధాన గేటు వద్ద అడ్డుగా కూర్చున్నారు. అమ్మ సమాధి నుంచి శశికళ ఇంటికి చేరుకున్నారని నిర్ధారించుకున్న తరువాతే వారంతా వెళ్లిపోయారు. తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నారు.  

జైలు నుంచి జయలలిత దత్తపుత్రుడు విడుదల  
బనశంకరి: జయలలిత దత్తపుత్రుడు వీఎన్‌ సుధాకరన్‌ శనివారం బెంగళూరులోని పరప్పన జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో శశికళ కంటే ముందుగానే విడుదల కావలసిన సుధాకరన్‌ రూ.10 కోట్లు జరిమానా చెల్లించకపోవడంతో ఏడాది అదనంగా జైల్లో ఉన్నారు. ఆయన సుమారు 4 ఏళ్ల 9 నెలలు జైలులో ఉన్నారు. గత ఏడాది శశికళ, ఆమె బంధువు ఇళవరసి అదనపు జరిమానాను చెల్లించి విడుదలయ్యారు. శశికళ విడుదలై ఇంటికి వెళ్లాక ఒక్కసారి కూడా సుధాకరన్‌ను కలవకపోగా కనీసం ఫోన్‌ కూడా చేయలేదని సమాచారం.

మరిన్ని వార్తలు